భారీ ఊరట: దిగొచ్చిన ద్రవ్యోల్బణం

12 Sep, 2023 20:56 IST|Sakshi

15 నెలల గరిష్టం నుంచి దిగొచ్చిన ద్రవ్యోల్బణం

ఆగస్టులో  6.83 శాతంగా నమోదు

 స్టాక్‌మార్కెట్లకు సానుకూలం

ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది.   జూలై 7.44 శాతం నుండి 6.83 శాతానికి  తగ్గి స్వల్ప ఊరట నిచ్చింది. అయితే ఆర్‌బీఐ   2-6 శాతం  పరిధితో పోలిస్తే   ద్రవ్యోల్బణం రేటు ఇంకా  ఎక్కువనే చెప్పాలి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి తగ్గుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. 

నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) తాజా డేటా ప్రకారం జూలైతో పోల్చితే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది.  జూలైలో 7.44 శాతం వద్ద 15 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో తగ్గి 6.83 శాతానికి చేరుకుంది. అలాగే జులైతో పోల్చితే ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 10 శాతం దిగువకు చేరింది. జులైలో 11.51 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి చేరుకుంది.అయితే పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.59 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా  ఆగస్టులో 26.14 శాతానికి దిగి వచ్చింది. అలాగే పాలు, ఇతర పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.34 శాతం నుంచి తగ్గి 7.73 శాతంగా నమోదయ్యాయి. మరోవైపు తాజా డేటా బుధవారం నాటి స్టాక్‌మార్కెట్‌ను ప్రభావితం చేయనుంది. 

రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం కొంతవరకు కారణం.అయితే, ఈ కాలంలో తృణధాన్యాలు, పప్పులు, పాలు మరియు పండ్ల వంటి కొన్ని అవసరమైన వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగాయయి. ద్రవ్యోల్బణాన్ని గణించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఆహార ధరలు, దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు  బాగా ప్రభావితం చేశాయి.ముఖ్యంగా టొమాటోలు , ఉల్లిపాయలు వంటి ప్రధానమైన వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. 


 

మరిన్ని వార్తలు