2027 నాటికి మూడో స్థానానికి భారత్‌

23 Sep, 2023 04:58 IST|Sakshi

5 ట్రిలియన్‌ డాలర్లకు ఎకానమీ

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పాత్రా

ముంబై: భారత్‌ 2027 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైకేల్‌ డీ పాత్ర అంచనా వేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కంబోడియా నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాత్రా ప్రసంగించారు.

వచ్చే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం తూర్పు ఆసియావైపు మళ్లుతుందన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో ఈ ప్రాంతం మూడింట రెండొంతులు ఆక్రమించిందని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్‌ 16.66 శాతం వాటా పోషించినట్టు చెప్పారు. ‘‘మార్కెట్‌ ఎక్సే్ఛంజ్‌ రేట్ల పరంగా భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, కొనుగోలు శక్తి పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలో 140 కోట్లతో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారత్‌. 28 ఏళ్లలోపు యువ జనాభా ఎక్కువ. భారత పురోగతికి ఇతర ముఖ్య ప్రేరణ ఏమిటంటే ఫైనాన్షియల్‌ రంగం నాణ్యత పెరగడం’’అని పాత్రా వివరించారు. భారత్‌ వృద్ధి ఆకాంక్షలకు కావాల్సిన వనరులు సమకూర్చుకునేందుకు వీలుగా ఆధునికంగా, సమర్థవంతంగా, బలంగా పనిచేసే ఆర్థిక రంగం అవసరమని అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు