ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్దం.. ఐరాసలో భారత్‌ కీలక నిర్ణయం

12 Nov, 2023 12:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌ అంశంతో మరోసారి ఆచితూచి వ్యవహరించింది. తాజాగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై భారత్‌ అనుకూలంగా ఓటువేసింది. ఇక, తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది.

వివరాల ప్రకారం.. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలెం, సిరియాకు చెందిన గోలాన్‌ హైట్స్‌లో ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా.. 18 దేశాలు తటస్థంగా ఓటు వేశాయి. మరోవైపు.. కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్‌, మార్షల్‌ఐలాండ్స్‌, ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియా, నౌరు, అమెరికా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. 

మరోవైపు, ఇటీవల ఇజ్రాయెల్‌-హమాస్‌ యద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. దీనిలో హమాస్‌ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్‌ వ్యతిరేకించింది. అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్‌కు భారత్‌ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. 120 దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేశాయి. 

గాజాలో దారుణ పరిస్థితులు..
ఇదిలా ఉండగా.. గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్‌ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సందర్భంగా పాలస్తీనా అధికారులు శుక్రవారం మాట్లాడుతూ.. హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 11,078 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. వారిలో దాదాపు 40శాతం మంది చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. గాజాపై నిరంతరం వైమానిక, శతఘ్ని దాడులు నిర్వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

నిలిచిపోయిన వైద్యసేవలు..
కరెంటు సరఫరా లేకపోవడంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్‌ ఖుద్స్‌ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్‌ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్‌ నస్ర్, అల్‌ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి.

ఇది కూడా చదవండి: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు