స్టార్టప్‌లకు నిధులు: 40 శాతం ఢమాల్‌!

11 Jul, 2022 12:19 IST|Sakshi

ఏప్రిల్‌-జూన్‌త్రైమాసికంలో 40 శాతం డౌన్‌

6.8 బిలియన్‌ డాలర్లకు పరిమితం  

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక-రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో దేశీ స్టార్టప్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 40 శాతం పడిపోయి 6.8 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. పీడబ్ల్యూసీ ఇండియా రూపొందించిన స్టార్టప్‌ డీల్స్‌ ట్రాకర్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంకుర సంస్థల్లో సగటున 5 మిలియన్‌ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో 60 శాతం వాటాను ప్రారంభ దశలోని అంకుర సంస్థలే దక్కించుకున్నాయి.

వరుసగా మూడు త్రైమాసికాల పాటు 10 బిలియన్‌ డాలర్ల పైగా నిధులు సమకూర్చుకున్న దేశీ స్టార్టప్‌ వ్యవస్థ ఈ ఏడాది (2022) రెండో త్రైమాసికంలో 6.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే సమకూర్చుకోగలిగిందని నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొంది.  టెక్నాలజీ స్టాక్స్‌ వేల్యుయేషన్లు పడిపోవడం, ద్రవ్యోల్బణం ఎగియడం, అంతర్జాతీయంగా మందగమనం, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది.  

సాస్‌ కంపెనీల్లోకి అత్యధికంగా నిధులు.. 
ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ (సాస్‌), ఫిన్‌టెక్‌ కంపెనీల్లోకి అత్యధికంగా 3.1 బిలియన్‌ డాలర్ల మేర నిధులు వచ్చాయి. ప్రారంభ దశలోని అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు సుమారు 800 మిలియన్‌ డాలర్ల స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి. రాబోయే త్రైమాసికాల్లోనూ ఇదే ధోరణి ఉండవచ్చని లేదా డిజిటైజేషన్‌ ఊతంతో మరింతగా పెరగవచ్చని నివేదిక తెలిపింది. మొత్తం మీద నిధుల ప్రవాహం ఒక స్థాయిలో స్థిరపడటానికి 12-18 నెలలు పట్టొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈలోగా స్టార్టప్‌లు తాము నిధులు సమకూర్చుకునేందుకు అవసరమైన విధంగా వ్యాపారాలను తీర్చిదిద్దుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ అమిత్‌ నావ్‌కా పేర్కొన్నారు.  వివిధ దశల్లో ఉన్న స్టార్టప్‌ల వేల్యుయేషన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.  

నివేదికలోని మరిన్ని వివరాలు .. 
బెంగళూరు, ముంబై, దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) కీలక స్టార్టప్‌ నగరాలుగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 95 శాతంగా ఉంది. చెన్నై, పుణె ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 
బెంగళూరులో ఏడు కంపెనీలు 100 మిలియన్‌ డాలర్ల పైగా సమీకరించాయి. డైలీహంట్, ర్యాపిడో, లీడ్‌స్క్వేర్డ్, లెన్స్‌కార్ట్, క్రెడ్, ఎథర్‌ ఎనర్జీ, అబ్జర్వ్‌.ఏఐ వీటిలో ఉన్నాయి. 
ఎన్‌సీఆర్‌లో 7 కంపెనీలు  100 మిలియన్‌ డాలర్ల పైగా సమీకరించాయి. 
ముంబైలో నాలుగు కంపెనీలు తలో 100 మిలియన్‌ డాలర్లు అందుకున్నాయి. అప్‌గ్రాడ్, జెప్టో, కాయిన్‌డీసీఎక్స్, టర్టిల్‌మింట్‌ వీటిలో ఉన్నాయి. 
2022 రెండో త్రైమాసికంలో దేశీయంగా నాలుగు అంకుర సంస్థలు మాత్రమే యూనికార్న్‌ (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌) హోదా దక్కించుకున్నాయి. అంతర్జాతీయంగా యూనికార్న్‌ల సంఖ్య 1,200కి చేరింది. ఇక, డెకాకార్న్‌ల సంఖ్య (10 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ ఉన్నవి) 57కి చేరింది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో కొత్తగా నాలుగు సంస్థలు ఈ జాబితాలోకి చేరాయి.  

మరిన్ని వార్తలు