దేశంలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్‌ అమ్మకం.. కొన్నది ఎవరంటే?

31 Mar, 2023 20:35 IST|Sakshi

గగనమే హద్దుగా రియల్‌ ఎస్టేట్‌లో ఆకాశహర్మ్యాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భూతల స్వర్గాన్ని తలపించే ముంబై మహానగరంలో లగ్జరీ ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. 

ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ఖరీదైన సౌత్‌ ముంబై మలబార్‌ హిల్స్‌ రెసిడెన్షియల్‌ టవర్స్‌లోని ఫ్లాట్లను ఫ్యామీకేర్‌ అధినేత జేపీ తపారియా రూ.369 కోట్లకు కొనుగోలు చేశారు. మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ (లోధా గ్రూప్‌) నుంచి సూపర్‌ లగర్జీ ట్రిపుల్‌ ఎక్స్‌ అపార్ట్‌మెంట్‌లోని 26, 27, 28 ఈ మూడు ఫ్లోర్లను తపారియా సొంతం చేసుకున్నారు. 1.08 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇల్లు అరేబియా సముద్రం, హాంగింగ్ గార్డెన్స్ రెండింటినీ తాకుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ట్రిపుల్‌ ఎక్స్‌ ఏరియా 27,160స్కైర్ ఫీట్లతో ఉండగా.. ఒక్కో స్కైర్‌ ఫీట్‌ను రూ1.36 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక స్టాంప్‌ డ్యూటీ కింద తపారియా కుటుంబం రూ.19.07 కోట్లు చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.  

నీరజ్‌ బజాజ్‌ సైతం
బజాజ్‌ ఆటో ఛైర్మన్‌ నీరజ్‌ బజాజ్‌, మలబార్‌ హిల్‌ ప్రాంతంలో మూడంతస్తుల (ట్రిప్లెక్స్‌) అపార్ట్‌మెంట్‌ని రూ.252.5 కోట్లతో కొనుగోలు చేశారు. సముద్రపు దిక్కుగా 18,008 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ (లోధా గ్రూప్‌) నుంచి సొంతం చేసుకున్నారు. 31 అంతస్తులుగా నిర్మిస్తున్న లోధా మలబార్‌ ప్యాలెసెస్‌లో 29, 30, 31 అంతస్తుల్లో నీరజ్‌ బజాజ్‌ బుక్‌ చేసుకున్న ఈ ట్రిప్లెక్స్‌కు 8 కార్ల పార్కింగ్‌ సదుపాయం ఉంది. ఈ ఇంటికి స్టాంప్‌ డ్యూటీగానే రూ.15.15 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు