ఇండస్‌ఇండ్‌ లాభం జూమ్‌

19 Oct, 2023 05:00 IST|Sakshi

క్యూ2లో రూ. 2,202 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఇండస్‌ఇండ్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 22 శాతం ఎగసి రూ. 2,202 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,805 కోట్లు ఆర్జించింది. మొండిబకాయిలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది.

మొత్తం ఆదాయం సైతం రూ. 10,719 కోట్ల నుంచి రూ. 13,530 కోట్లకు జంప్‌ చేసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 5,077 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 4.24 శాతం నుంచి 4.29 శాతానికి స్వల్పంగా మెరుగుపడ్డాయి. ఇతర ఆదాయం రూ. 2,011 కోట్ల నుంచి రూ. 2,282 కోట్లకు బలపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.11 శాతం నుంచి 1.93 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.61 శాతం నుంచి 0.57 శాతానికి నీరసించాయి. ప్రొవిజన్లు రూ. 1,141 కోట్ల నుంచి రూ. 974 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 18.21 శాతంగా నమోదైంది. ఈ కాలంలో 3,500 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నట్లు బ్యాంక్‌
వెల్లడించింది.  

ఫలితాల నేపథ్యంలో ఇండస్‌ఇండ్‌ షేరు 1% నష్టంతో రూ. 1,421 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు