దిగ్గజ టెక్‌ కంపెనీ సీఎఫ్‌ఓ రాజీనామా.. ఎందుకంటే..

12 Dec, 2023 15:21 IST|Sakshi

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్‌రాయ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అందుకు సంబంధించి బీఎస్‌ఈకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ పంపారు. 

నీలంజన్‌రాయ్‌ 2018 నుంచి తన పదవిలో కొనసాగారు. ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే నిబంధనల ప్రకారం రాయ్‌ మార్చి 31, 2024 వరకు ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఎగా కొనసాగుతారు. ‘ఇన్ఫోసిస్‌లో కాకుండా బయట వృద్ధి చెందేందుకు అవకాశాలను అన్వేషించడానికి, వ్యక్తిగత కారణాల వల్ల కంపెనీకి రాజీనామా చేశాను. నోటీసు పీరియడ్‌ వరకు ఈ సంస్థలో విధులు నిర్వర్తిస్తాను. నా పదవీకాలంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్‌ మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని రాయ్ తన రాజీనామా లేఖలో రాశారు. 

రాయ్‌ అనంతరం జయేష్ సంఘ్‌రాజ్కా సీఎఫ్‌ఓ బాధ్యతలు చేపడుతారని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త సీఎఫ్‌ఓగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పింది. జయేష్‌ ఇన్ఫోసిస్‌లో 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్‌ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆస్తులు అమ్మనున్న టాప్‌ ఐటీ కంపెనీ..!

ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ..డిప్యూటీ సీఎఫ్‌ఓగా పనిచేస్తున్న జయేష్‌ సీఎఫ్‌ఓగా బాధ్యతలు చేపడుతారు. కంపెనీ ఫైనాన్స్ విభాగంలో చాలా ఏళ్లుగా ఆయన పనిచేస్తున్నారు. కంపెనీని మరింత అభివృద్ధి చెందించడానికి ఆయన అనుభవం ఎంతో అవసరం అవుతుందని అన్నారు. నీలాంజన్‌ భవిష్యత్తు ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తున్నట్లు సలీల్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు