వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు!

3 Sep, 2023 19:04 IST|Sakshi

ఆసియాలోనే అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ (Uday Kotak).. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) సీఈవో, ఎండీ పదవి నంచి వైదొలిగారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎలా స్థాపించింది.. ఎలా అభివృద్ధి చేసింది వివరిస్తూ ‘ఎక్స్‌’ (ట్విటర్) (Twitter)లో సుదీర్ఘ ట్వీట్‌ చేశారు. 

"విశ్వసనీయత, పారదర్శకత అనే ప్రాథమిక సిద్ధాంతాలతో మేం ఏర్పాటు చేసిన సంస్థ ఇప్పడొక ప్రముఖ బ్యాంక్, ఆర్థిక సంస్థ. మా వాటాదారులకు అత్యంత విలువను సృష్టించాం. లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించాం. 1985లో సంస్థలో పెట్టిన రూ.10,000 పెట్టుబడి ఈరోజు దాదాపు రూ.300 కోట్లు అవుతుంది" అంటూ రాసుకొచ్చారు ఉదయ్‌ కోటక్‌.

ఆ కలతోనే..
‘జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి సంస్థను భారత్‌లో ఏర్పాటు చేయాలని 38 సంవత్సరాల క్రితం కల కన్నాను. ఆ కలతోనే ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల చిన్న కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో కోటక్ మహీంద్రా సంస్థను ప్రారంభించాం’ అని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో భారతీయ యాజమాన్యంలోని ఈ సంస్థ మరింత ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఉదయ్‌ కోటక్‌ పేర్కొన్నారు. 

రిటైర్మెంట్‌ కంటే ముందే పదవి నుంచి వైదొలగిన ఉదయ్‌ కోటక్‌.. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తాకు పగ్గాలు అందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ సభ్యుల ఆమోదానికి లోబడి డిసెంబర్ 31 వరకు దీపక్‌ గుప్తా తాత్కాలిక ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. 2024 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త ఎండీ, సీఈవో నియామకానికి ఆమోదం కోసం ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్‌కి దరఖాస్తు చేసింది.

మరిన్ని వార్తలు