ఇరెడా ఐపీవో సక్సెస్‌

24 Nov, 2023 04:55 IST|Sakshi

చివరి రోజుకల్లా 39 రెట్లు అధిక బిడ్స్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మినీరత్న సంస్థ ఇండియన్‌ రెనెవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఐఆర్‌ఈడీఏ–ఇరెడా) పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు గురువారానికల్లా 39 రెట్లు అధిక స్పందన నమోదైంది. కంపెనీ 47 కోట్లకుపైగా షేర్లను ఆఫర్‌ చేయగా.. 1,827 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి.

సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 24 రెట్లు, రిటైలర్ల నుంచి దాదాపు 8 రెట్లు అధికంగా బిడ్స్‌ లభించాయి. అర్హతగల కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో అయితే దాదాపు 105 రెట్లు అధికంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రూ. 30–32 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా సోమవారం(20న) యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 643 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే.  

ఈక్విటీ వివరాలిలా
ఐపీవోలో భాగంగా 40.31 కోట్ల ఈక్విటీ షేర్లను ఇరెడా తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్‌ కేంద్ర ప్రభుత్వం 26.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. ఈక్విటీ జారీతో రూ. 1,290 కోట్లు, ప్రభుత్వ వాటాకు రూ. 860 కోట్ల చొప్పున లభించనున్నాయి. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 2,150 కోట్లు సమకూర్చుకోనుంది. గతేడాది మే
నెలలో బీమా
రంగ దిగ్గజం ఎల్‌ఐసీ లిస్టింగ్‌ తదుపరి మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకి రావడం విశేషం! కాగా.. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు వినియోగించనుంది.

మరిన్ని వార్తలు