ఐటీ కంపెనీలు అంతంతే.. మళ్లీ నిరాశాజనకమే!

9 Oct, 2023 09:32 IST|Sakshi

క్యూ2లో టాప్‌ సంస్థలపై మార్కెట్‌ అంచనాలు

అంతర్జాతీయ అనిశ్చితి కారణం

న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలకు సాధారణంగా రెండో త్రైమాసికం పటిష్టమైనదే అయినప్పటికీ ఈసారి మాత్రం ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండనున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల స్థూల ఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు నెలకొనడంతో క్లయింట్లు తమ వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటం... ఐటీ సంస్థలకు ప్రతికూలంగా ఉండనుంది. పరిస్థితులు మెరుగుపడతాయనేందుకు అర్థవంతమైన సంకేతాలేమీ లేకపోవడంతో క్యూ1లో కనిపించిన బలహీనత రెండో త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

అక్టోబర్‌ 11న టీసీఎస్‌తో మొదలుపెట్టి ఐటీ దిగ్గజాలు రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్‌ 12న ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, 18న విప్రో ఫలితాలు వెలువడనున్నాయి. ‘సాధారణంగా ఐటీ కంపెనీలకు రెండో త్రైమాసికం పటిష్టంగానే ఉంటుంది. కానీ త్రైమాసికాలవారీగా టాప్‌ అయిదు కంపెనీల వృద్ధి చూస్తే మైనస్‌ 1 శాతం (టెక్‌ మహీంద్రా), ప్లస్‌ 1.9 శాతం (హెచ్‌సీఎల్‌ టెక్‌) మధ్య ఉండొచ్చు‘ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఒక నోట్‌లో తెలిపింది. పెద్ద ఐటీ కంపెనీలు ఒక మోస్తరుగానే ఉన్నా.. మధ్య స్థాయి సంస్థలు మాత్రం మెరుగ్గానే రాణించనున్నాయి.  

తగ్గనున్న వృద్ధి వేగం .. 
ఐటీ సేవల రంగం జులై–సెప్టెంబర్‌ క్వార్టర్‌లో త్రైమాసికాల వారీగా సగటున 1.5 శాతం, వార్షికంగా 5.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. దశాబ్దకాలంలో నమోదైన అత్యంత తక్కువ వృద్ధి రేట్లలో ఈ క్వార్టర్‌ ఒకటి కాగలదని పేర్కొంది.

అధిక ద్రవ్యోల్బణం, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించుకుంటూ ఉండటం వంటి పరిణామాలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులు, బీమా, రిటైల్, హై–టెక్, కమ్యూనికేషన్స్‌ వంటి రంగాల్లో మందగమనం కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. వ్యయాల తగ్గింపు, కన్సాలిడేషన్‌కు సంబంధించిన భారీ డీల్స్‌తో ద్వితీయార్ధంలో ప్రథమ శ్రేణి కంపెనీల వ్యాపారం సాధారణ స్థాయికి తిరిగి రాగలదని, 2025 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడటానికి బాటలు వేయగలవని షేర్‌ఖాన్‌ వివరించింది. 

మరిన్ని వార్తలు