లారస్‌ ల్యాబ్స్‌- అలెంబిక్‌.. భలే జోరు

10 Sep, 2020 15:20 IST|Sakshi

షేర్ల ముఖ విభజన- క్యూ1లో పటిష్ట ఫలితాలు

4.5 శాతం అప్‌- సరికొత్త గరిష్టానికి లారస్‌ ల్యాబ్స్

ప్రమోటర్ల వాటా పెంపు- అలెంబిక్‌ 12 శాతం ప్లస్‌

52 వారాల గరిష్టానికి షేరు- ఈ నెలలో 30 శాతం ర్యాలీ

దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు హెల్త్‌కేర్‌ రంగ కౌంటర్లు మరింత దూకుడు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లారస్‌ ల్యాబ్స్‌ షేరు తాజాగా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇక మరోపక్క అలెంబిక్‌ లిమిటెడ్‌ సైతం 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇతర వివరాలు చూద్దాం..

లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌
వరుసగా నాలుగో రోజు లారస్‌ ల్యాబ్స్‌ షేరు జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 4.5 శాతం జంప్‌చేసింది. రూ. 1,265కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా..  ప్రస్తుతం 2.3 శాతం ఎగసి రూ. 1,239 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి గత నాలుగు నెలల్లో ఈ షేరు 171 శాతం ర్యాలీ చేసింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 19 శాతంమే బలపడింది. కాగా.. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. ఇందుకు సెప్టెంబర్‌ 30 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది.

అలెంబిక్‌ లిమిటెడ్
ఈ నెల మొదట్లో ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యాక జోరందుకున్న అలెంబిక్‌ లిమిటెడ్‌ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 12 శాతం దూసుకెళ్లి రూ. 115కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 30 శాతం ర్యాలీ చేసింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ఈ నెల 2-4 మధ్య నిరయూ లిమిటెడ్‌ అదనంగా 0.6 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు అలెంబిక్‌ ఇప్పటికే తెలియజేసింది. నిజానికి జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 67.62 శాతం నుంచి 69.57 శాతానికి ఎగసింది. ఈ నేపథ్యంలో అలెంబిక్‌ కౌంటర్‌ జోరు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు