మాల్స్‌ అదుర్స్‌.. పుంజుకుంటున్న రిటైల్‌ రంగం

30 Sep, 2023 08:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రభావం రిటైల్‌ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో షాపింగ్‌ మాల్స్‌ విలవిల్లాడిపోయాయి. ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వృద్ధి చూశాక ఇక ఆఫ్‌లైన్‌లోని రిటైల్‌ రంగం కోలుకోవడం కష్టమేమో అనిపించింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా ప్రభావం నుంచి షాపింగ్‌ మాల్స్‌ శరవేగంగా కోలుకున్నాయి. మాల్స్‌లోని రిటైల్‌ దుకాణాలలో కొనుగోలుదారుల సందడి, మల్టీప్లెక్స్‌లలో వీక్షకుల తాకిడి పెరగడంతో మాల్స్‌ నిర్వాహకులలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త షాపింగ్‌ మాల్స్‌ వస్తున్నాయి. 

►షాపింగ్‌ మాల్స్, హైస్ట్రీట్‌లలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో హైదరాబాద్‌లో రిటైల్‌ లీజులు 137 శాతం పెరిగాయని సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. అయితే రిటైల్‌ మార్కెట్‌ పరిమాణం ఇంకా పెరగాల్సి ఉందని, ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ రిటైల్‌ రంగం చాలా వెనకబడి ఉంది. 

►ఫ్యాషన్, హోమ్‌వేర్, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ వంటి రిటైలర్ల డిమాండ్‌ను బట్టి షాపింగ్‌ మాల్స్‌లో లీజు లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో రిౖ టెల్‌ లీజులు 17–28 శాతం మేర పెరిగి 55–60 లక్షల చ.అ.లకు చేరుతుందని అంచనా వేసింది. 20 19లో అత్యధికంగా 68 లక్షల చ.అ. లీజు లావాదేవీ లు జరిగాయి. 2021లో 39 లక్షలు, 2022లో 47 లక్షల చ.అ. రిటైల్‌ లీజు కార్యకలాపాలు పూర్తయ్యాయి. 

►హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణం తుదిదశలో ఉన్నాయి. డిమాండ్‌ ఉన్న ప్రాంతాలలో నిర్మాణం పూర్తికాకముందే లీజులు జరుగుతున్నాయి. గత ఏడాది డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉండటంతో పూర్తయ్యే దశకు చేరినా లీజు లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే ఈ ఏడాది కొంత సానుకూల వాతావరణం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు నగరంలో 2.5 లక్షల చ.అ. రిటైల్‌ స్థల లీజు లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో కేవలం లక్ష చ.అ. స్థలం మాత్రమే లీజుకు పోయింది. రిటైల్‌ లీజులలో స్టోర్‌ల వాటా 33 శాతం ఉండగా.. ఫ్యాషన్, అపరెల్స్‌ షో రూమ్‌ల వాటా 30 శాతం, ఫుడ్‌ కోర్టుల వాటా 11 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు