అదిరిపోయిన మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!

14 Feb, 2022 09:18 IST|Sakshi

ఇప్పటికే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతున్న మనకు తెలిసిందే. ప్రముఖ దిగ్గజ కంపెనీలతో సహ ఇతర స్టార్టప్ కంపెనీలు తమ వాహనాలను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాయి. కొన్ని సంస్థ‌ల ఎల‌క్ట్రిక్ కార్లు, బైక్‌లు, స్కూట‌ర్లు ఇప్ప‌టికే మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ప్రస్తుతం కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ దూసుకొని వెళ్తుంది. ఈవీ రంగంలో కాస్త వెనుక బడిన దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి(ఎంఎస్ఐ) కూడా ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్(ఈవీ) సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతుంది. 

ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్స్‌తో క‌లిసి గ్లోబ‌ల్ మిడ్ సైజ్ ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీని మారుతి సుజుకి అభివృద్ధిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారుకి వైవై8 అనే కోడ్‌నేమ్ పెట్టాయి. ఇప్ప‌టివ‌ర‌కు మార్కెట్‌లోకి వ‌చ్చిన ఈవీ కార్ల కంటే చాలా శ‌క్తిమంత‌మైన ఎల‌క్ట్రిక్ కారుగా నిల్వనున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విదేశాలకు కూడా ఎగుమతి చేసేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిని సుజుకికి చెందిన గుజరాత్ ప్లాంట్లో తయారు చేయనుంది. నివేదిక ప్రకారం.. వైవై8 4.2 మీటర్ల పొడవైన బాడి, పొడవైన 2,700 మీ.మీ వీల్ బేస్ ఉండనుంది. ఇందులో 48 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో కూడిన సింగిల్ 138 హెచ్‌పీ మోటార్ ఉంటుంది. ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 59 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 170 హెచ్‌పీ మోటార్ గల మోడల్ కారు 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. 

మారుతి-ట‌యోటా అభివృద్ధి చేస్తున్న ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ కారులో వినియోగించే భార‌త్‌లో త‌యారు చేసిన బ్యాట‌రీలే వాడనున్నారు. గుజ‌రాత్‌లోని లిథియం అయాన్ బ్యాట‌రీ మాన్యుఫాక్చ‌ర‌ర్ టీడీఎస్జీ ఈ బ్యాట‌రీలు త‌యారు చేస్తున్న‌ది. ఈ బ్యాట‌రీని సుజుకి మోటార్ కార్పొరేష‌న్‌, డెన్సో కార్పొరేష‌న్‌, తొషిబా కార్పొరేష‌న్ ఉమ్మ‌డిగా అభివృద్ది చేస్తున్నాయి. 2025లో మారుతి-ట‌యోటా వైవై8 ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ మార్కెట్లోకి రానున్న‌ది. ప్రస్తుతం రెండు కంపెనీలు కారు ధ‌ర త‌గ్గించ‌డంపైనే ఫోక‌స్ చేస్తున్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ మోటార్స్ జ‌డ్ఎస్ ఈవీ కంటే మారుతి-ట‌యోటా ఈవీ కారు ధ‌ర చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని సమాచారం. ఈ కారు ధ‌ర రూ.13-15 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా. 

(చదవండి: రయ్‌మంటూ దూసుకెళ్లిన రిలయన్స్‌..! డీలా పడ్డ టీసీఎస్‌..!)

మరిన్ని వార్తలు