ఇజ్రాయెల్‌ - హమాస్‌ ఉద్రిక్తతలు,‘మెక్‌డొనాల్డ్స్‌’ను బాయ్‌కాట్‌ చేయాలని పిలుపు

15 Oct, 2023 13:39 IST|Sakshi

ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య ఉద్రిక్తతలు ప్రముఖ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ దిగ్గజం మెక్‌డొనాల్డ్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. 

ఇటీవల,హమాస్‌ ఉగ్రవాదుల ఏరేవేతే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతికార దాడులకు తెగబడుతోంది. అయితే, వారి పోరాటానికి మెక్‌డొనాల్డ్స్‌ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో మెక్‌డొనాల్డ్‌ తీరును విమర్శిస్తూ ప్రపంచ దేశాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. 

సైనికులు ఉచిత ఆహారం
ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా మెక్‌ డొనాల్డ్‌ ఇజ్రాయెల్‌ సైన్యానికి మద్దతు పలికింది. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(Israel Defence Forces)లో భాగమైన హాస్పిటల్స్‌, సైన్యానికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే  4,000 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. యుద్ధం చేస్తున్న సైనికులు కాకుండా డిఫెన్స్‌లో పనిచేస్తున్న సోల్జర్స్‌ కోసం ప్రత్యేకంగా 5 రెస్టారెంట్లను ప్రారంభించినట్లు తెలిపింది. 

బాయ్‌కాట్‌కు పిలుపు
దీంతో హమాస్‌ మద్దతు దారులు మెక్‌డొనాల్డ్స్‌ను బాయ్‌కాట్‌ చేయాలని పిలునిచ్చారు. ‘ఐడీఎఫ్‌కి మెక్‌డొనాల్డ్ ఉచిత భోజనాన్ని అందిస్తోంది. మనం మన సూత్రాలకు కట్టుబడి ఉండాలి. నమ్మకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి’ అనే నినాదంతో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న మెక్‌డొనాల్డ్స్‌ వంటి కంపెనీలను బహిష్కరిద్దామని పిలుపునిచ్చారు. మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ సైన్యానికి ఉచితంగా భోజనం ఇస్తుంటే గాజాలో ప్రభావితమైన వారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా హమాస్‌ మద్దతుదారులందరూ మెక్‌డొనాల్డ్స్‌ను బహిష్కరించాలని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ మద్దతు దారులు మాత్రం మెక్‌డొనాల్డ్‌ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

మెక్‌డొనాల్డ్స్‌ ప్రకటనపై నిరసనలు
ఇదిలా ఉండగా అక్టోబర్ 13న ఇజ్రాయెల్‌ సైనికులకు ఉచిత ఆహార ప్రకటనపై లెబనాన్‌ దేశంలో నిరసనలు చెలరేగాయి. లెబనాన్ ఆధారిత 961 నివేదిక ప్రకారం, స్పిన్నీస్, సిడాన్‌లోని మెక్‌డొనాల్డ్స్‌పై పాలస్తీనియన్ గ్రూపులు దాడి చేశాయి. దీనిపై మెక్‌డొనాల్డ్స్ లెబనాన్ అధికారిక నోట్‌ను విడుదల చేసింది. ఇతర దేశాలు, భూభాగాల్లోని ఇతర ఫ్రాంఛైజీల్లోని మెక్‌డోనాల్డ్స్‌ నిర్ణయాలపై  మెక్‌ డొనాల్డ్స్‌ లెబనాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. 

ఒమన్ మెక్‌డొనాల్డ్స్ గాజాకు తమ మద్దతును తెలిపింది. గాజాలోని ప్రజల సహాయ చర్యల కోసం కంపెనీ 100,000 డాలర్లు విరాళంగా అందించింది. మెక్‌డొనాల్డ్స్ ఒమన్ (అల్ దౌద్ రెస్టారెంట్స్ ఎల్‌ఎల్‌సీ) గాజాలోని సోదరులు, సోదరీమణులకు అండగా నిలుస్తాం. విలువలు, మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని నోట్‌లో వెల్లడించింది.

మరిన్ని వార్తలు