బంపరాఫర్‌, ఐపీఓకి టాటా టెక్నాలజీ.. ఒక్కోషేర్‌ ధర ఎంతంటే?

16 Nov, 2023 10:58 IST|Sakshi

మదుపర్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగియనుంది. ఇందుకు వీలుగా ఈ నెల 13న ఆర్‌వోసీ మహారాష్ట్రకు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసినట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. 

ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానమైన 6.08 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్‌ 11.4 శాతం వాటాను ఆఫర్‌ చేయనుండగా.. పీఈ సంస్థ అల్ఫా టీసీ హోల్డింగ్స్‌ 2.4 శాతం వాటాను విక్రయించనుంది. ఇక టాటా క్యాపిటల్‌ సైతం 1.2 శాతం వాటాను ఆఫర్‌ చేస్తోంది.

 తాజాగా ధరల శ్రేణి, కనీస పెట్టుబడి సహా ఇతర కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించింది. ఈ లెక్కన అత్యధిక ధర వద్ద కంపెనీ రూ.3,042 కోట్లు సమీకరించనుంది.

కాగా.. టాటా టెక్నాలజీస్‌లో టీపీజీ రైజ్‌ క్లయిమేట్‌కు 9.9 శాతం వాటాను విక్రయించేందుకు గత నెలలో టాటా మోటార్స్‌ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,614 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది.  
 

మరిన్ని వార్తలు