ఒకే పథకం.. రెండు ప్రయోజనాలు

5 Jun, 2023 07:44 IST|Sakshi

ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. పెట్టుబడులకు పన్ను ఆదా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. మెరుగైన రాబడులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే పన్ను ఆదా ప్రయోజనం చూడాలి.

అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయని తెలిసిందే. పన్ను ఆదా ప్రయోజనంతో ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాలతో దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో చక్కని, నమ్మకమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఈ మొత్తంపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు సొంతం చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఈ పథకంలో చేసే ప్రతి పెట్టుబడికి అక్కడి నుంచి మూడేళ్ల పాటు లాకిన్‌ ఉంటుంది. మూడేళ్లు నిండిన తర్వాతే ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి అనుమతిస్తారు. 

రాబడులు 
5 స్టార్‌ రేటెడ్‌ పథకం ఇది. ఏడాది కాలంలో 11 శాతం రాబడులను ఇవ్వగా, మూడేళ్లలో ఏటా 27 శాతం ప్రతిఫలాన్ని పెట్టుబడులపై అందించింది. ఇక ఐదేళ్లలో ఏటా 15 శాతం రాబడిని ఇచ్చింది. ఏడేళ్లలో చూసుకున్నా వార్షిక రాబడి రేటు 17.44 శాతంగా ఉంది. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో వార్షిక సగటు రాబడి 12 శాతానికి పైన ఉంటే దాన్ని మెరుగైనదిగా భావిస్తారు. ఈ పథకం రాబడులకు బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ సూచీని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సూచీతో పోలిస్తే మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌ ఐదేళ్లు, ఏడేళ్ల కాలంలో రెండు నుంచి మూడు శాతం అధికంగా వార్షిక రాబడిని అందించింది. కనుక ఐదేళ్లకు మించిన కాలానికే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లలోపు లక్ష్యాలకు అచ్చమైన ఈక్విటీలు అనుకూలం కాదని నిపుణుల సూచన. 

పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తోంది. అంటే నగదు నిల్వలు తక్కువగా నిర్వహిస్తుండడాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,218 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిల్లో 99.16 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఇందులోనూ లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే 69 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఇక మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 5.57 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 66 స్టాక్స్‌ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే 32 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఆ తర్వాత అత్యధికంగా ఇంధన రంగ కంపెనీల్లో 11.13 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీల్లో 9 శాతం, సేవల రంగ కంపెనీల్లో 8.15 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. ఈ నాలుగు రంగాల్లోనే 60 శాతం పెట్టుబడులు ఉండడం గమనించొచ్చు.  

మరిన్ని వార్తలు