2022లో ఉద్యోగం మారిపోవాలి..!

19 Jan, 2022 02:43 IST|Sakshi

చేసే పని పరంగా సౌకర్యం ఉండాలి

ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

మెజారిటీ ఉద్యోగుల మనోగతం

లింక్డ్‌ఇన్‌ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: మెజారిటీ నిపుణులు ఈ ఏడాది ఉద్యోగం మారిపోయే ఆలోచనతో ఉన్నారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ భవిష్యత్తు పట్ల వారిలో ఎంతో ఆశావాదం కనిపించింది. నిపుణుల నెట్‌వర్క్‌ సంస్థ లింక్డ్‌ఇన్‌ ‘జాబ్‌ సీకర్‌ రీసెర్చ్‌’ పేరుతో సర్వే వివరాలను మంగళవారం విడుదల చేసింది. దేశంలో 82 శాతం నిపుణులు 2022లో ఉద్యోగాన్ని మార్చాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. ఎందుకని? అని ప్రశ్నించగా.. చేస్తున్న పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కష్టంగా ఉందని, తగినంత ధనం లేదని, కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లాలని ఉందని ఇలా పలు రకాల సమాధానాలు సర్వేలో పాల్గొన్న వారి నుంచి వచ్చాయి.

పని పరంగా సౌకర్యమైన ఏర్పాట్లే తమకు ప్రాధాన్య అంశంగా ఎక్కువ మంది చెప్పారు. చేస్తున్న పని – జీవన సమతుల్యత సరిగ్గా లేకపోవడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులు 1.3 రెట్లు అధికంగా ఉద్యోగాన్ని వీడే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. పురుషుల్లో ఇలాంటి అభిప్రాయం కలిగిన వారు 28 శాతంగా ఉన్నారు. మెరుగైన వేతనం ఇస్తే ప్రస్తుత కంపెనీతోనే కొనసాగుతామని 49 శాతం మంది మహిళలు చెప్పగా.. పునరుషుల్లో ఇది 39 శాతంగానే ఉంది. 

ప్రాధాన్యతల్లో మార్పు..  
‘‘తమ కెరీర్‌ (వృత్తి జీవితం) పట్ల పునరాలోచించేలా, కొత్త ఉద్యోగ అవకాశాల అన్వేషణ, జీవిత ప్రాధాన్యతల విషయంలో పునరాలోచించుకునేలా మహమ్మారి చేసింది. నైపుణ్యాలే ఇప్పుడు నడిపించే సాధనం. నేడు సౌకర్యమే వారి మొదటి ప్రాధాన్యం’’ అని లింక్డ్‌ఇన్‌ న్యూస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంకిత్‌ వెంగుర్‌లేకర్‌ తెలిపారు. ఐటీ, హెల్త్‌కేర్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగినట్టు చెప్పారు. నిపుణులు తమ ఉద్యోగ బాధ్యతలు, కెరీర్‌ పట్ల నేడు ఎంతో నమ్మకంగా ఉన్నారని, మొత్తం మీద 2022లో ఉద్యోగాల లభ్యత మెరుగ్గా ఉంటుందని లింక్డ్‌ఇన్‌ తెలిపింది.  

ప్రశ్నించుకునే తత్వం 
ఉద్యోగుల్లో కెరీర్, భవిష్యత్తు పట్ల ఎంతో సానుకూలత కనిపించినప్పటికీ.. 71 శాతం మంది నిపుణులు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో చేస్తున్న పనిలో తమ నైపుణ్యాలను ప్రశ్నించుకుంటున్నట్టు లింక్డ్‌ఇన్‌ సర్వే పేర్కొంది. తమ పనిపై సందేహం అన్నది గడిచిన రెండేళ్లుగా ఒంటరిగా పనిచేస్తుండడం వల్లేనని తెలిపింది. కరోనా మహ మ్మారి పని విషయంలో తమ నమ్మకాన్ని దెబ్బతీసినట్టు 33 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు