1.66 లక్షల కోట్లు ‘సిప్‌’ చేశారు!

14 Dec, 2023 06:34 IST|Sakshi

11 నెలల్లో పెట్టుబడుల విలువ ఇది.. గతేడాది కంటే అధికం

17 వేల కోట్లు దాటిన నెలవారీ పెట్టుబడులు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడులకు (సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌/సిప్‌) ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు నిదర్శంగా ఈ ఏడాది  11 నెలల్లో (జనవరి–నవంబర్‌) సిప్‌ రూపంలో ఫండ్స్‌లోకి రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్‌ కనిష్ట పెట్టుబడిని రూ.250కు తగ్గించే దిశగా పనిచేస్తున్నట్టు సెబీ చైర్‌పర్సన్‌ మాధురి పురి బుచ్‌ ఇటీవలే ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.

ఇది అమల్లోకి వస్తే సిప్‌ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2022 సంవత్సరం మొత్తం మీద సిప్‌ రూపంలో ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటే, ఈ ఏడాది మరో నెల మిగిలి ఉండగానే దీన్ని అధిగమించడం గమనార్హం. ఇక 2021లో సిప్‌ రూపంలో ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.1.14 లక్షల కోట్లుగా, 2020లో రూ.97,000 కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇక మీదట ఏటా సిప్‌ పెట్టుబడులు స్థిరంగా పెరుగుతూ వెళతాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏఎంసీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అఖిల్‌ చతుర్వేది పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆశావహ అంచనాలు, మార్కెట్లో ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం పెరగిన నేపథ్యంలో.. ఫండ్స్‌లో సిప్‌ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. మార్కెట్లు బలంగా ఉండడం, చక్కని రాబడులకు ఉన్న అవకాశాల నేపథ్యంలో 2024లో సిప్‌ రూపంలో వచ్చే పెట్టుబడులు పెరుగుతాయనే నమ్మకం బలపడుతున్నట్టు తెలిపారు.  

మద్దతిస్తున్న అంశాలు
2022 డిసెంబర్‌ నెలలో సిప్‌ రూపంలో ఈక్విటీ పథకాల్లోకి వచి్చన పెట్టుబడులు రూ.11,305 కోట్లు కాగా, 2023 నవంబర్‌ నెలకు ఈ మొత్తం రూ.17,073 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్, సెపె్టంబర్‌ నెలల్లోనూ రూ.16వేల కోట్లకు పైనే సిప్‌ పెట్టుబడులు వచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని సిప్‌ ఆస్తులు నవంబర్‌ చివరికి రూ.9.31 లక్షల కోట్లకు పెరిగాయి. 2022 డిసెంబర్‌ చివరికి ఇవి రూ.6.75 లక్షల కోట్లుగా ఉన్నాయి.

యాంఫి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, అధిక జనాభా, ఈక్విఈలపై అధిక రాబడులు, పెట్టుబడుల సౌలభ్యం తదితర అంశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక పెరగడానికి అనుకూలించే అంశాలుగా మార్కెట్‌ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ‘‘సిప్, ఈక్విటీ పెట్టుబడుల వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన కల్పించడంలో యాంఫి ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈక్విటీలకు ఒక పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి పెరగడం కూడా సిప్‌ పెట్టుబడులు పెరగానికి అనుకూలిస్తోంది’’అని అఖిల్‌ చతుర్వేది వివరించారు.

సిప్‌ ద్వారా ఇన్వెస్టర్‌ తాను ఎంపిక చేసుకున్న పథకంలో నిరీ్ణత రోజులకు ఒకసారి పెట్టుబడి పెట్టుకోవచ్చు. మార్కెట్‌ ర్యాలీలు, పతనాల్లోనూ సిప్‌ పెట్టుబడి కొనసాగడం వల్ల కొనుగోలు ధర సగటుగా మారి, రాబడులు మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం సిప్‌ కనీన పెట్టుబడి రూ.500గా ఉంది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా సిప్‌ కనీస పెట్టుబడిని రూ.250కి తగ్గించాలని సెబీ భావిస్తోంది.

>
మరిన్ని వార్తలు