కార్పొరేట్లకు మద్దతులో ఎస్‌బీఐ పాత్ర భేష్‌

3 Nov, 2023 04:36 IST|Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

శ్రీలంక ఓడరేవు పట్టణం ట్రింకోమలీలో బ్రాంచ్‌ ప్రారంభం

కొలంబో: భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలోసైతం కార్పొరేట్లకు మద్దతు ఇవ్వడంలో బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అందిస్తున్న సేవలు అద్భుతమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు. అంతక్రితం ఆమె శ్రీలంక తూర్పు ఓడరేవు పట్టణం ట్రింకోమలీలో ఎస్‌బీఐ శాఖను ప్రారంభించారు. తూర్పు ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్, శ్రీలంకలో భారత హైకమిషనర్‌ గోపాల్‌ బాగ్లే, ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖారా కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు విచ్చేసిన సీతారామన్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ప్రారంభించే ముందు నగరంలో ప్రధాన హిందూ దేవాలయాన్ని సైతం సందర్శించి పూజలు చేశారు. అనంతరం లంక ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఎస్‌బీఐ శాఖ ప్రారంభం అనంతరం ఆమె ఏమన్నారంటే. వాణిజ్యాభివృద్ధిలో ఎస్‌బీఐ 159 సంవత్సరాల గణనీయమైన ప్రభావాన్ని కలిగిఉంది.

ఇది శ్రీలంకలో అత్యంత పురాతనమైన బ్యాంక్‌. స్వదేశంతో పాటు విదేశాల్లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు భారత్‌ 1 బిలియన్‌ అమెరికా డాలర్ల విలువైన క్రెడిట్‌ లైన్‌ను సజావుగా కొనసాగించడానికి ఎస్‌బీఐ మార్గం సుగమం చేసింది. శ్రీలంకలోని బ్రాంచ్‌ కార్యకలాపాలతో పాటు, ఎస్‌బీఐ శ్రీలంక యోనో యాప్, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా బలమైన డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ను ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. తద్వారా డిజిటల్‌ చెల్లింపుల పురోగతికి దోహదపడుతోంది.

ద్వైపాక్షిక చర్చల పునఃప్రారంభ నేపథ్యం...
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం (ఈటీసీఏ) కోసం భారత్‌– శ్రీలంక ఉన్నతాధికారుల మధ్య చర్చల పునఃప్రారంభం నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శ్రీలంక మూడురోజుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2016 నుంచి 2018 వరకు ఇరుదేశాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. ఆ తర్వాత చర్చలు నిలిచిపోయాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 1వ తేదీ మధ్య 12వ దఫా చర్చలు జరిగాయి.

12వ రౌండ్‌లో వస్తు సేవలు, కస్టమ్స్‌ విధానాలు, వాణిజ్య సౌలభ్యం, వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు, నివారణ వంటి పలు అంశాలు చోటుచేసుకున్నాయి. భారత్‌కు చెందిన అనేక ప్రముఖ కంపెనీలు శ్రీలంకలో ఇప్పటికే పెట్టుబ డులు పెట్టాయి. పెట్రోలియం రిటైల్, టూరిజం, హోటల్, తయారీ, రియల్‌ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలలో భారతదేశం నుండి ప్రధాన పెట్టుబడులు ఉన్నాయి. 2022–23లో శ్రీలంకకు భారత్‌ ఎగుమతులు 5.11 బిలియన్‌ డాలర్లు. 2021–22లో ఈ విలువ 5.8 బిలియన్‌ డాలర్లు. ఇక భారత్‌ దిగుమతులు చూస్తే, 2021–22లో ఈ విలువ ఒక బిలియన్‌ కాగా, 2022–23లో 1.07 బిలియన్‌ డాలర్లకు చేరింది.
 

మరిన్ని వార్తలు