కొత్త స్టీల్‌ ప్లాంట్లు లేనట్టే: ఎన్‌ఎండీసీ

16 Aug, 2022 06:17 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త ఉక్కు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు లేనట్టేనని మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ సీఎండీ సుమిత్‌ దేవ్‌ తెలిపారు. ఖనిజాల అన్వేషణపైనే దృష్టిసారిస్తామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్మాణంలో ఉన్న 3 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌ను వ్యూహాత్మక కొనుగోలుదారుకు విక్రయించిన తర్వాత ఎన్‌ఎండీసీ ఉక్కు రంగంలో తన ఆసక్తిని కొనసాగిస్తుందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

‘ఇనుము ధాతువు ఉత్పత్తి 2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల స్థాయికి చేర్చాలన్నది సంస్థ లక్ష్యం. 2021–22లో 42 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి అయింది. అంత క్రితం ఏడాదిలో ఇది 34 మిలియన్‌ టన్నులు. ఎన్‌ఎండీసీ భారత్‌తోపాటు ప్రపంచ స్థాయిలో బలమైన మైనింగ్‌ కంపెనీగా తన స్థానాన్ని పెంపొందించుకుంటుంది. స్టీల్‌ అనేది కంపెనీ ప్రాధాన్యత కాదు. నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌ విలీనం ప్రస్తుత త్రైమాసికంలోనే కార్యరూపం దాల్చనుంది. స్టీల్‌ ప్లాంటులో కార్యకలాపాలు సెప్టెంబర్‌ చివరినాటికి ప్రారంభం అవుతాయి’ అని వివరించారు.

మరిన్ని వార్తలు