ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు

31 Mar, 2023 07:41 IST|Sakshi

అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ఆహార పదార్థాలపై కేంద్ర ‍ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని మినహాయించింది. అలాగే వివిధ క్యాన్సర్‌ల చికిత్సలో వాడే పెంబ్రోలిజుమాబ్ (కీట్రుడా) ఔషధంపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసింది. వ్యక్తిగత దిగుమతిదారులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఔషధాలు, ఆహార పదార్థాలపై దిగుమతి సుంకం మినహాయింపులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

సాధారణంగా బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులు, ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం మేర ఉంటుంది. ప్రాణాలను రక్షించే అత్యవసర మందులు, వ్యాక్సిన్‌లపై మాత్రం 5 శాతం దిగుమతి సుంకం ఉంటుంది. కొన్ని మందులపై అయితే కస్టమ్స్ డ్యూటీ అస్సలు ఉండదు.

నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద జాబితాలో చేర్చిన అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని రకాల మందులు, ఆహార పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ మినహాయింపును పొందేందుకు వ్యక్తిగత దిగుమతిదారు కేంద్ర లేదా రాష్ట్ర డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ లేదా జిల్లా మెడికల్ ఆఫీసర్, సివిల్ సర్జన్ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

మరిన్ని వార్తలు