భవిష్యత్తులో పేటీఎంకు నిధుల అవసరం ఉండదు - మాధుర్‌ దియోర

13 Sep, 2023 08:33 IST|Sakshi

స్థిరమైన నగదు ప్రవాహాలపై నమ్మకం

పేటీఎం ఈడీ మాధుర్‌ దియోర

న్యూఢిల్లీ: సమీప కాలంలో పేటీఎంకు నిధుల అవసరం లేదని, స్థిరమైన సానుకూల నగదు ప్రవాహాలను సాధిస్తామనే నమ్మకం ఉందని సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాధుర్‌ దియోర తెలిపారు. రుణ భారం సున్నా అని, బ్యాలన్స్‌షీటు ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. రూ.8,300 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయంటూ, ఫ్రీ క్యాష్‌ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్‌) విషయంలో నమ్మకంతో ఉన్నట్టు ప్రకటించారు. 

పేటీఎం 23వ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా దియోర ఈ వివరాలు వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రసంగిస్తూ.. కంపెనీ వృద్ధి భారత్‌ శక్తితో ముడిపడి ఉన్నట్టు ప్రకటించారు. ‘‘పేటీఎం వృద్ధి చెందుతుందంటే భారత్‌ కూడా వృద్ధి సాధిస్తున్నట్టే. దేశంలో చిన్న వ్యాపారుల ఛాంపియన్స్‌ మేము. సరైన టెక్నాలజీ, ఆర్థిక సేవలను ఒక్కసారి చిన్న వర్తకుడికి పరిచయం చేస్తే భారత్‌కు అసలైన వృద్ధి ఇంజన్‌ ఏర్పడినట్టే. 

ఉపాధి అవకాశాలతోపాటు, దేశంలో సమ్మిళిత ఆర్థిక సేవలకు మేము మార్గం చూపిస్తున్నాం’’అని శర్మ పేర్కొన్నారు. ఇటీవలి జీ20 సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ ఇండియా ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌లో పేటీఎం తన టెక్నాలజీని ఇతర దేశాల నేతలకు పరిచయడం చేయడం గమనార్హం. పేటీఎం రూపొందించిన ఏఐ సాఫ్ట్‌వేర్‌ స్టాక్‌ వ్యయాలను తగ్గిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సురక్షితంగా మారుస్తుందన్నారు. ‘‘మనం త్వరలోనే ప్రపంచ సూపర్‌ పవర్‌గా మారతాం. పేటీఎం దీనికి నాయకత్వం వహిస్తుంది’’అని శర్మ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు