Supertech Twin Towers Demolition: టెస్ట్‌ బ్లాస్ట్‌ సక్సెస్‌.. 40 అంతస్థుల బిల్డింగ్‌ కూల్చివేతకు అంతా రెడీ

11 Apr, 2022 14:01 IST|Sakshi

దేశవ్యాప్తంగా రియల్టీ రంగాన్ని కుదిపేస్తోన్న నోయిడా ట్విన్‌ టవర్‌ కేసులో టెస్ట్‌ బ్లాస్టింగ్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 2022 ఏప్రిల్‌ 10న మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:45 గంటల నడుమ ఈ బ్లాస్ట్‌ను నిర్వహించారు. ఈ జంట భవనాలకు సంబంధించి గ్రౌండ్‌ ఫ్లోర్‌, 14వ అంతస్థుల్లో ఐదు కేజీల పేలుడు పదార్థాలతో టెస్ట్‌ బ్లాస్ట్‌ చేపట్టారు. సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూ్‌ట్‌ (సీబీఆర్‌ఐ) రూర్కీ నుంచి వచ్చిన నిపుణులు బ్లాస్టింగ్‌ పనులను పర్యవేక్షించారు.

సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి 2022 మే 22న ఈ జంట భవనాలను కూల్చివేయబోతున్నారు. టెస్ట్‌ బ్లాస్ట్‌ అనంతరం ఈ రెండు భవనానలు కూల్చి వేసేందుకు 3,000ల నుంచి 4,000 కేజీల పేలుడు పదార్థాలు అవసరం అవుతాయని అంచనా. దాదాపు 9 సెకన్లలో ఈ భవంతి నేలమట్టం అవుతుందని పేలుడు పనులు దక్కించుకున్న ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ జెట్‌ డిమాలిషన్‌ సంస్థ తెలిపింది.

నోయిడా సెక్టార్‌ 93ఏలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సూపర్‌టెక​ రియాల్టీ సంస్థ ఎమరాల్డ్‌ పేరుతో 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణ పనులు చేపట్టింది. దీనిపై అలహాబాద్‌ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో కూడా అనేక విడతలుగా విచారణ జరిగింది. చివరకు జంట భవనాలను కూల్చివేయాల్సిందే అంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

చదవండి: నోయిడా ట్విన్‌ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది?

మరిన్ని వార్తలు