Okinawa - Tacita Joint Venture: ఇటలీ సంస్థతో ఒకినావా ఆటోటెక్‌ జట్టు!

20 May, 2022 17:52 IST|Sakshi

ముంబై: ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ టేసిటాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒకినావా ఆటోటెక్‌ వెల్లడించింది. దీని ప్రకారం స్కూటర్లు, మోటర్‌సైకిళ్లతో పాటు దేశ, విదేశీ మార్కెట్లకు పవర్‌ట్రెయిన్ల తయారీ కోసం జాయింట్‌ వెంచర్‌ (జేవీ) ఏర్పాటు చేయనున్నారు. 

భారత్‌ కేంద్రంగా జేవీ ఏర్పాటవుతుందని, రాజస్థాన్‌లోని తమ రెండో ప్లాంటులో 2023 నుంచి ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఒకినావా ఆటోటెక్‌ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్‌ శర్మ తెలిపారు. వచ్చే ఏడాది తయారు చేసే వాటిలో ఒక స్కూటర్, హై–ఎండ్‌ మోటర్‌సైకిల్‌ మోడల్‌ ఉంటాయని ఆయన వివరించారు. ప్రథమార్ధంలో డిజైనింగ్, అభివృద్ధి మొదలైన పనులు చేపట్టనున్నట్లు శర్మ చెప్పారు. 

టేసిటా సొంతంగా పవర్‌ట్రెయిన్, కంట్రోలర్, మోటర్, బ్యాటరీ ప్యాక్‌లు మొదలైన వాటిని డిజైన్‌ చేసుకుని, ఉత్పత్తి చేస్తుంది. జేవీలో భాగంగా టేసిట్‌ పవర్‌ట్రెయిన్‌ మొదలైనవి అందించనుండగా స్థానికంగా ఉత్పత్తి అభివృద్ది, తయారీని ఒకినావా చేపడుతుంది. మార్కెట్‌పై గట్టి పట్టు ఉన్న ఒకినావాతో జట్టు కట్టడంపై టేసిటా ఎండీ పీర్‌పాలో రిగో సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు