పెట్టుబడిదారులకు శుభవార్త, ఐపీఓకి ఓలా ఎలక్ట్రిక్‌.. ఎప్పుడంటే?

11 Dec, 2023 19:01 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్‌లోని పెట్టుబడిదారులకు శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్‌ త్వరలో ఐపీఓకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థ ఫౌండర్‌, సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ డిసెంబర్‌ 20న సెబీకి డ్రాఫ్ట్‌ రెడ్‌ హియరింగ్‌ ప్రాస్‌పెక్ట్‌ (DRHP)ని దాఖలు చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఓ ద్వారా 700 మిలియన్‌ డాలర్లను సేకరించనున్నారు. 

ఓలా లక్ష్యం అదే 
ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌ బ్యాంక్‌ పెట్టుబడులున్న ఓలా సంస్థ వచ్చే ఏడాదిలో ఆ సంస్థ విలువ 7 నుంచి 8 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండేలా ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. దానికి అనుగుణంగా ఐపీఓ ద్వారా నిధులు సేకరించి.. వాటితో ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్‌ బ్యాటరీలను తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని సమాచారం.  

నవంబర్‌ 17 నుంచే ప్రయత్నాలు ప్రారంభం
ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 17న తన ఐపీఓ కోసం సన్నాహకాలు ప్రారంభించింది.  కంపెనీ పేరును ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌గా మార్చే ప్రయత్నాలు చేసింది. అయితే ఏదైనా కంపెనీ ఐపీఓకి రావాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చాల్సి ఉంటుంది. అందుకే తన కంపెనీ పేరును మార్చనుంది.

>
మరిన్ని వార్తలు