అమెరికాలో భారతీయులు, తల్లిదండ్రుల నుంచి దూరంగా లక్ష మంది పిల్లలు

4 Sep, 2023 18:16 IST|Sakshi

అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారనుందా? ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు లేఆఫ్స్‌తో గ్రీన్‌ కార్డ్‌ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా అక్కడ నెలకొన్న పరిస్థితులు. 

అగ్రరాజ్యంలో శాశ్వత నివాస హోదా పొందాలంటే ‘గ్రీన్‌ కార్డ్‌’ తప్పని సరి. ఇప్పుడీ గ్రీన్‌ కార్డ్‌ పొందే విషయంలో లక్షల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లక్ష మందికిపైగా పిల్లలు వారి తల్లిదండ్రుల్ని వదిలి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.  

18లక్షలు దాటిన సంఖ్య
అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అయితే, ఇప్పుడా హెచ్‌1బీ వీసా దారులు అమెరికాలో శాస్వత నివాసం ఉండేందుకు గ్రీన్‌ కార్డ్‌ కావాలి. వారి సంఖ్య 18 లక్షలు దాటింది.

134ఏళ్లు ఎదురు చూడాలా?
ప్రతి ఏడాది ఆయా దేశాల బట్టి అగ్రరాజ్యం గ్రీన్‌ కార్డ్‌లను మంజూరు చేస్తుంది. అలా భారత్‌కు ప్రతి ఏడాది 7 శాతం అంటే 65,000 గ్రీన్‌ కార్డ్‌లను అందిస్తుంది. అయితే గ్రీన్‌ కార్డ్‌ కోసం ఎదురు చూస్తున్న 18 లక్షల మందికి  వాటి (గ్రీన్‌ కార్డ్‌)  ప్రాసెసింగ్‌కు పడుతున్న సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎదురు చూడాల్సి సమయం అక్షరాల 134 ఏళ్లు.  

తల్లిదండ్రుల నుంచి విడిపోవడం తప్పదా?
ఉద్యోగం చేస్తూ చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్థులకు పర్మినెంట్​ రెసిడెన్సీ హోదాను గ్రీన్​ కార్డ్ కల్పిస్తుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో హెచ్-1బీ వంటి వీసాలు ఉంటాయి. చాలా మంది ఉద్యోగం చేస్తూనే అక్కడ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీరి పిల్లలు.. 21ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు తల్లిదండ్రుల వద్ద ఉండొచ్చని హెచ్​-4 వీసా నిబంధనలు చెబుతున్నాయి. ఈలోపు తల్లిదండ్రులకు గ్రీన్​ కార్డ్​ వస్తే మంచిదే! లేకపోతే.. పిల్లలు, సొంత దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. 

హెచ్‌1బీ వీసా, గ్రీన్‌ కార్డ్‌ అంటే ఏంటి?
అమెరికాలో గ్రీన్‌కార్డ్‌, సిటిజన్‌ షిప్‌ కావాలంటే హెచ్‌1బీ అనే వర్క్‌ పర్మిట్‌ మీద అక్కడికి వెళ్లాలి. ఆ వర్క్‌ పర్మిట్‌ రావాలంటే అమెరికాలో ఉన్న కంపెనీ మన దేశంలో ఉన్న మనకి ఈ హెచ్‌1బీ వీసా ఇస్తుంది. హెచ్‌1 బీ వీసా వచ్చింది. అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ కనీసం 6 ఏళ్ల పని చేయాల్సి ఉంటుంది. అనంతరం గ్రీన్‌ కార్డ్‌ కోసం అప్లయ్‌ చేయాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల నిర్ణీత సమయంలో ఆ గ్రీన్‌ కార్డ్‌ను పొందలేకపోతే తిరిగి స్వదేశానికి వెళ్లాలి. ఒక ఏడాది పాటు అక్కడే ఉండి హెచ్‌1బీ వీసా మీద అమెరికాకు వచ్చి గ్రీన్‌ కార్డ్‌ కోసం అప్లయ్‌ చేసుకోవచ్చు. గ్రీన్‌ కార్డ్‌ వచ్చిన 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరులుగా (american citizenship) గుర్తింపు పొందుతాం. 

గ్రీన్‌ కార్డ్‌కి, సిటిజన్‌ షిప్‌కి తేడా
హెచ్‌1 బీ వీసాతో అమెరికాకు వెళ్లి ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం పొందాలంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదే గ్రీన్‌ కార్డ్‌, లేదంటే అమెరికా సిటిజన్‌ షిప్‌ ఉంటే ఉద్యోగాలు త్వరగా వస్తాయి. జీతాలు సైతం భారీగా ఉంటాయి. 

భారత్‌లో ఉంటే కష్టమే 
భారత్‌లో ఉండి హెచ్‌1బీ వీసా తెచ్చుకోవడం కొంచెం కష్టమే. కాబట్టే భారతీయ విద్యార్ధులు చదువు కోసం అమెరికా వెళతారు. ఎడ్యుకేషన్‌ వీసాతో అమెరికా వెళ్లి 2ఏళ్ల పాటు చదివితే హెచ్‌1 బీ వీసా లేకపోయినా మరో 3ఏళ్లు అక్కడ ఉండే అవకాశం కలుగుతుంది. రెండేళ్లు చదువు పూర్తి చేసుకున్న అనంతరం జాబ్‌ చేస్తాం కాబట్టి హెచ్‌1 బీ వీసా వెంటనే పొందవచ్చు.  

మోదీ పర్యటనతో 
ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముందు బైడెన్‌ సర్కార్‌ అమెరికాలోని భారతీయులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిమెంట్‌ ఆధరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడి) కోసం కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. 

అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్‌ కార్డ్‌ అర్హతలను సరళతరం చేసింది. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ కోసం అర్హతలకు సంబంధించి కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వారి కలను సాకారం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహద పడుతుంది. 

ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లి అక్కడే శాస్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మినెంట్‌ రెసిడెంట్‌ కార్డ్‌ గ్రీన్‌ కార్డ్‌ లను జారీ చేస్తారు. అమెరికా ఇమిగ్రేషన్‌ చట్టం ప్రకారం.. ప్రతి ఏటా లక్షా 40 వేల గ్రీన్‌ కార్డ్‌లను జారీ చేస్తారు. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్యలో మాత్రమే గ్రీన్‌ కార్డ్‌ కార్డ్‌లను జారీ చేస్తారు. ప్రస్తుతం, మొత్తం ధరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ ఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే గ్రీన్‌ కార్డ్‌లను జారీ చేస్తున్నారు. తాజాగా, ఈఏడీ నిబంధనల్ని సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలగనుంది.గ్రీన్‌ కార్డ్‌ కోసం కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్‌ చేసుకునే వారికి కూడా ఈ నూతన మార్గదర్శకాలు వర్తింప చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది.

చదవండి👉మైక్రోసాఫ్ట్‌ సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు