హోల్‌సేల్‌లో తగ్గిన వాహన అమ్మకాలు

14 Apr, 2022 10:34 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్యాసింజర్‌ వాహనాల హోల్‌సేల్‌ విక్రయాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నెలలో 2,79,501 యూనిట్లు నమోదయ్యాయి. 2021 మార్చితో పోలిస్తే ఇది 4 శాతం తగ్గుదల అని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియమ్‌) చెబుతోంది. ‘2021 మార్చితో పోలిస్తే ద్విచక్ర వాహన అమ్మకాలు గత నెలలో 21 శాతం పడిపోయి 11,84,210 యూనిట్లుగా ఉంది. మోటార్‌సైకిల్స్‌ 21 శాతం తగ్గి 1,86,479 యూనిట్లు, స్కూటర్స్‌ 21 శాతం తక్కువై 3,60,082 యూనిట్లకు వచ్చి చేరాయి. ఇక 2020–21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహనాల హోల్‌సేల్‌ అమ్మకాలు 6 శాతం తగ్గి 1,86,20,233 నుంచి 1,75,13,596 యూనిట్లకు వచ్చి చేరింది.

ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 13 శాతం ఎగసి 30,69,499 యూనిట్లను నమోదు చేశాయి. ద్విచక్ర వాహనాలు 11 శాతం తగ్గి 1,34,66,412 యూనిట్లకు పడిపోయాయి. గడిచిన 10 ఏళ్లలో ఈ స్థాయి అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. త్రిచక్ర వాహనాలు 2,19,446 నుంచి 2,60,995 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 5,68,559 నుంచి 7,16,566 యూనిట్లను తాకాయి. ఎగుమతులు 41,34,047 నుంచి 56,17,246 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లోనూ ఎగుమతులు దూసుకెళ్లాయి. ప్రధానంగా ద్విచక్ర వాహన ఎగుమతులు రికార్డు స్థాయిలో 44,43,018 యూనిట్లు నమోదయ్యాయని సియామ్‌ నివేదిక వెల్లడించింది.  
 

చదవండి: మారుతి జోరులో టాటా పంచ్‌లు !?

మరిన్ని వార్తలు