పేటీఎం ఐపీవోకు ఇన్వెస్టర్ల క్యూ..

11 Nov, 2021 04:40 IST|Sakshi

1.89 రెట్ల స్పందన ∙9.14 కోట్ల షేర్లకు బిడ్లు

బంపర్‌ లిస్టింగ్‌ అంచనాలు

ముంబై: డిజిటల్‌ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) 1.89 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్‌ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్‌ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం సత్వరం ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కాగా, ఇష్యూ ఆఖరు రోజైన బుధవారం నాడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) సహా సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా రంగంలోకి దిగారు. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి.

దీంతో వచ్చే వారం పేటీఎం లిస్టింగ్‌ భారీగా ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి.  క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయర్స్‌ (క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్‌ వచ్చాయి. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్‌ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. నవంబర్‌ 15న షేర్లను అలాట్‌ చేయనుండగా, 18న లిస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. లిస్టింగ్‌ రోజున పేటీఎం దాదాపు 20 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) పైగా వేల్యుయేషన్‌ దక్కించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.  

కోల్‌ ఇండియాను మించిన ఇష్యూ..
ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూనే ఉంది. కోల్‌ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080 – 2,150గా కంపెనీ నిర్ణయించింది. విజయ్‌ శేఖర్‌ శర్మ 2000లో వన్‌97 కమ్యూనికేషన్స్‌ని (పేటీఎం మాతృ సంస్థ) ప్రారంభించారు. దాదాపు దశాబ్దం క్రితం మొబైల్‌ రీచార్జి, డిజిటల్‌ చెల్లింపు సేవల సంస్థగా ఏర్పాటైన పేటీఎం .. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లు యాంట్‌ గ్రూప్, సాఫ్ట్‌ బ్యాంక్‌ మొదలైన వాటికి ఇందులో పెట్టుబడులు ఉన్నాయి.

సఫైర్‌ ఫుడ్స్‌కు 1.07 రెట్ల స్పందన
న్యూఢిల్లీ: కేఎఫ్‌సీ, పిజా హట్‌ అవుట్‌లెట్స్‌ నిర్వహణ సంస్థ సఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ రెండో రోజున పూర్తి స్థాయిలో సబ్‌స్క్రైబ్‌ అయింది. 96.63 లక్షల షేర్లను ఆఫర్‌ చేస్తుండగా 1.03 కోట్ల షేర్లకు (1.07 రెట్లు) బిడ్స్‌ వచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ గణాంకాల్లో వెల్లడైంది. రిటైల్‌ వ్యక్తిగత ఇన్వెస్టర్ల (ఆర్‌ఐఐ) విభాగం 5.38 రెట్లు, సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల విభాగం 29 శాతం, క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయర్స్‌ (క్యూఐబీ) విభాగం 3 శాతం మేర సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఈ ఇష్యూ ద్వారా సఫైర్‌ ఫుడ్స్‌ రూ. 2,073 కోట్లు సమీకరిస్తోంది. ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 933 కోట్లు సమీకరించింది. ఐపీవో ధరల శ్రేణి షేరు ఒక్కింటికి రూ. 1,120–1,180గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 31 నాటికి సఫైర్‌ ఫుడ్స్‌ భారత్, మాల్దీవుల్లో 204 కేఎఫ్‌సీ రెస్టారెంట్లను.. భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో 231 పిజా హట్‌ రెస్టారెంట్లను, శ్రీలంకలో రెండు టాకో బెల్‌ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు