సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

31 Oct, 2022 22:54 IST|Sakshi

వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

న్యూఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, ముంబైలో రూ.106.31గా ఉంది. కోల్‌కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, హైదరాబాద్‌లో రూ.109.66గా ఉంది. మంగళవారం నుంచి ఈ ధరలపై 40 పైసలు త్గగింది.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గి చాలా రోజులుగా స్థరంగా కొనసాగుతుండటంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు  తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు దిగువన ఉంది.  ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో చివరిసారిగా ఏప్రిల్ 7 ఇంధన ధరలను తగ్గించారు.

అలాగే ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంతో అక్టోబర్ తొలి అర్ధభాగంలో ఇంధన విక్రయాలు భారీగా పెరిగి కరోనా ముందు స్థితికి చేరుకున్నాయి. పండుగ సీజన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు భారీ వృద్ధి నమోదు చేశాయి. దీంతో ధరలు తగ్గించాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం లీటర్‌పై 40 పైసలే తగ్గించినప్పటికీ.. రానున్న రోజుల్లో రూ.2వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఎయిర్‌టెల్‌ బంపరాఫర్‌: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్‌, తెలిస్తే వావ్‌ అనాల్సిందే!

మరిన్ని వార్తలు