అలర్ట్‌: పాపులర్‌ డవ్‌, ఇతర షాంపూల్లో కేన్సర్‌ కారక కెమికల్స్‌, రీకాల్‌

25 Oct, 2022 16:46 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ యూనీ లీవర్‌ తన వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్‌, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్‌ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా వాటిని భారీ ఎత్తున రీకాల్‌ చేసింది. ఈ నేపథ్యంలో కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తుల వినియోగాన్ని నిలిపి వేయాలని  వినియోగదారులకు  కంపెనీ సూచించింది. వీటిని వినియోగించడం ప్రమాదమంటూ హెచ్చరిక జారీ చేసింది.

యూనిలీవర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న  ప్రకటించింది. రీకాల్ చేసిన వాటిల్లో అక్టోబరు 2021కి ముందు తయారు చేసిన డ్రై షాంపూ ఏరోసోల్ ఉత్పత్తులున్నాయని యునిలీవర్ తన నివేదికలో తెలిపింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ కేన్సర్‌ కారకం బెంజీన్‌కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది. వీటి వాడకంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ  రీకాల్ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది. 

కాగా బెంజీన్ అధిక స్థాయిలోశరీరంలో చేరితే లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్‌ మారో క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ప్రమాదకరమైన కలుషితాలను గుర్తించడం ఇదే మొదటి సారి కాదు. తాజా పరిణామంతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఏరోసోల్‌ల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గత ఏడాదిన్నర కాలంలో, జాన్సన్ అండ్‌ జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి.అలాగే ప్రోక్టర్ అండ్‌ గాంబుల్ స్ప్రే-ఆన్ యాంటీ పెర్స్పిరెంట్‌లు సీక్రెట్ అండ్ ఓల్డ్ స్పైస్, యూనిలివర్స్ సువేవ్ లాంటి ఉత్పత్తులలో బెజీన్ కనుగొనడం,  రీకాల్‌ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు