Radhakishan Damani: ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్‌ బాధ్యతలు ‘గురువు’ గారికే!

22 Aug, 2022 15:32 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిగ్‌బుల్‌ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణం తరువాత ఆయన పెట్టుబడుల నిర్వహణ, ట్రస్ట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై మార్కెట్‌ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. అయితే మనీ కంట్రోల్‌ రిపోర్ట్‌ ప్రకారం ఝన్‌ఝన్‌వాలా విశ్వసనీయ మిత్రుడు, గురువు, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఝున్‌ఝున్‌వాలా ఎస్టేట్‌కు ప్రధాన ట్రస్టీగా వహిరిస్తారు. ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుత పెట్టుబడులపై  దమానీనే తుది నిర్ణయం తీసుకుంటారు.  ఇతర విశ్వసనీయలు కల్‌ప్రజ్ ధరంషి అమల్ పారిఖ్ ఇతర ట్రస్టీలుగా  ఉంటారు.

ఝున్‌ఝున్‌వాలా తన గురువుగా ఆర్‌కె దమానీని ఎపుడూ ప్రశంసిస్తూ ఉండేవారు. తన తండ్రి, టాటాస్‌, విన్‌స్టన్ చర్చిల్, జార్జ్ సోరోస్, రాధాకిషన్ దమానీ ఈ ఐదుగురు తనకు రోల్ మోడల్స్ అనీ, వారినుంచి స్ఫూర్తి పొందానని పలు ఇంటర్వ్యూలలో ఝున్‌ఝున్‌వాలా  గుర్తుచేసుకునేవారు. అందుకే విభిన్నమైన వ్యక్తిత్వాలతో, దలాల్ స్ట్రీట్‌లో ఈ రెండు బిగ్‌బుల్స్‌ మధ్య ఫ్రెండ్‌షిప్‌ని బాలీవుడ్ మూవీ'షోలే'లోని జై-వీరూలతో ఎక్కువగా పోలుస్తారు అభిమానులు. 

ఝున్‌ఝున్‌వాలా సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం,గత ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నందున ప్రతీ విషయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. మరోవైపు ఆయన భార్య, వ్యాపారవేత్త  రేఖా  కూడా వ్యాపార కుటుంబానికి  చెందినవారు, ఫైనాన్స్‌పై అపారమైన అవగాహన కూడా ఆమె సొంతం. దీంతోపాటు, రేఖా సోదరుడు సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారు.  అలాగే రేర్ ఎంటర్‌ప్రైజెస్‌ని ఉత్పల్ సేథ్ , అమిత్ గోలా ఆధ్యర్యంలోనే నడుస్తుంది.  ఝున్‌ఝున్‌వాలాకా  పెట్టుబడులపై సలహాలందించే  ఉత్పల్‌ గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి సారించారు.ఇక అమిత్ గోలా ట్రేడింగ్ అంశాలపై ఆయనకు కుడిభుజంలాపనిచేసేవారు. అమిత్‌  ట్రేడింగ్ బుక్‌నికూడా నిర్వహిస్తున్నారు.

కాగా  ఆగస్ట్ 14న మరణించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా  లిస్టెడ్ , అన్‌లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులతో సహా కోట్లాది రూపాయల ఆస్తులను అతని భార్య ముగ్గురు పిల్లలకు వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మేన్‌గా రాణిస్తున్న రాధాకిషన్ దమానీ ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు కూడా. రిటైల్ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్‌ పేరుతో ఎంట్రీ ఇచ్చి డి-మార్ట్  చెయిన్‌తో పెద్ద సంచలనమే క్రియేట్‌ చేశారు దమానీ. 2022 జూన్‌ నాటికి  అవెన్యూలో దమానీ నికర విలువ రూ. 1,80,000 కోట్లకు పైమాటే.
 

మరిన్ని వార్తలు