ఆర్‌బీఐ... బంగారం భరోసా!

7 Aug, 2020 05:12 IST|Sakshi
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్

ద్రవ్యపరపతి విధాన ప్రకటన

ఇక పసిడి విలువలో 90 శాతం వరకూ రుణం

ఇప్పటి వరకూ ఇది 75 శాతమే

చిన్న వ్యాపారాలు, సామాన్యునికి నగదు వెసులుబాటు

కీలక రేట్లు యథాతథం

ధరల స్పీడ్‌పై అనిశ్చితే కారణం...4% వద్ద ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు

క్షీణ బాటలోనే 2020–21 ఆర్థిక వ్యవస్థ  

ముంబై: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆర్థిక రంగానికి ఊతం అందించడానికి తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను పావుశాతం తగ్గిస్తుందన్న అంచనాలకు భిన్నంగా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలని మూడు రోజుల పాటు జరిగిన సమావేశం గురు వారం నిర్ణయించింది.

అయితే వృద్ధికి ఊపును అందించే క్రమంలో సరళతర ఆర్థిక విధానాలకే మొగ్గుచూపుతున్నట్లూ ప్రకటించింది. తద్వారా భవిష్యత్తులో రేటు కోతలు ఉండవచ్చని సూచించింది.  ప్రస్తుత పరిస్థితులు చూస్తే,  రిటైల్‌ ద్రవ్యోల్బణం 2020–21 ద్వితీయార్థంలో పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని పేర్కొంటూ, ధరల స్పీడ్‌ను కేంద్రం నిర్దేశిత 4 శాతం కట్టడే లక్ష్యంగా (2 ప్లస్‌ లేదా 2 మైనస్‌) ప్రస్తుతానికి కీలక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4%) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

ఇక కరోనా పరిస్థితుల నేపథ్యంలో డబ్బు అందక ఇబ్బందులు పడుతున్న  చిన్న సంస్థలు, వ్యాపారులు,  మధ్య, సామాన్యుని కి ఊరట కల్పించే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంది. దీనిప్రకారం... తన వద్ద ఉన్న పసిడిని బ్యాంకింగ్‌లో హామీగా పెట్టి  రుణం తీసుకునే వ్యక్తులు ఇకపై ఆ విలువలో 90% రుణాన్ని పొందగలుగుతారు. తాజా నిర్ణయం 2021 మార్చి వరకూ అమల్లో ఉంటుంది.  ఇప్పటి వరకూ (పసిడి రుణాలకు లో¯Œ  టు వ్యాల్యూ నిష్పత్తి) ఇది 75 శాతంగా ఉంది. పాలసీలో కొన్ని
ముఖ్యాంశాలు చూస్తే...

► ఏకగ్రీవ నిర్ణయం: ఫిబ్రవరి నుంచి 115 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించింది. తాజాగా ఈ రేటు యథాతథ స్థితిలో కొనసాగించాలని పరపతి విధాన కమిటీలోని మొత్తం ఆరుగురు సభ్యులూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. జూ¯Œ లో ద్రవ్యోల్బణం 6.09 శాతం నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నా... అటు తర్వాత తగ్గవచ్చనే అభిప్రాయాన్ని పరపతి కమిటీ వ్యక్తం చేసింది.
 
► 20 యేళ్ల కనిష్ట స్థాయిలోనే రేట్లు: రేట్లను యథాతథంగా కొనసాగిస్తుండడంతో రెపో రేటు (4 శాతం)  20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ఇక  రివర్స్‌ రెపో రేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే  అదనపు నిధులపై లభించే వడ్డీరేటు) 3.35 శాతంగా  కొనసాగుతుంది. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన కనీస మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) 3 శాతంగా కొనసాగనుంది.

► ధరల పెరుగుదలకు అవకాశం: కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ధరల పెరుగుదల అవకాశాలు, ఇందుకు సంబంధించి అనిశ్చితి ధోరణి నెలకొందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. సరఫరాల సమస్య ఇందుకు సంబంధించి ప్రధానంగా ఉందని పేర్కొంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న విషయాన్ని ఆర్‌బీఐ ప్రస్తావించింది. ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల తీవ్రంగా ఉందని వెల్లడించింది. 4 శాతం వద్ద  ద్రవ్యోల్బణం కట్టడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్న పాలసీ, మధ్య కాలికంగా ద్రవ్యోల్బణం శ్రేణిపై అంచనాలను మాత్రం వెలువరించలేదు.  

► నాబార్డ్, ఎన్‌హెచ్‌బీకి వెసులుబాటు: వ్యవసాయ రంగానికి సాయం అందించే క్రమంలో నేషనల్‌ బ్యాంక్‌  ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)కు రూ.5,000 కోట్ల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ను ఆర్‌బీఐ కల్పించింది. అలాగే హౌసింగ్‌ సెక్టార్‌ విషయంలో ద్రవ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎ¯Œ హెచ్‌బీ)కి కూడా రూ.5,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌలభ్యత కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఆయా రంగాలకు రుణాలను అందించే విషయంలో నా¯Œ –బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ద్రవ్య లభ్యత విషయంలో కొంత వెసులుబాటు కలుగుతుంది.  

► డిజిటల్‌ లావాదేవీలకు దన్ను: కార్డుల ద్వారా జరిపే చెల్లింపుల పరిమాణాన్ని పెంచడానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకోనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, భద్రతా చర్యలే ధ్యేయంగా ఈ దిశలో డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించడానికి  ఒక పైలట్‌ స్కీమ్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో ఇందుకు సంబంధించి విధివిధానాలు వెలువడతాయని తెలిపింది. ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ, స్పీడ్‌ తక్కువగా ఉండడంసహా ఇప్పటివరకూ డిజిటల్‌ పేమెంట్లలో నెలకొంటున్న ఇబ్బందులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ విభాగంలో మరింత ముందుకు వెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.  ఆ¯Œ లై¯Œ  డిస్ప్యూట్‌ రిజల్యూష¯Œ  (ఓడీఆర్‌) ఏర్పాటు ప్రతిపాదన కూడా ఈ విభాగంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒకటి.  

రుణ గ్రహీతకు వరం
అటు కార్పొరేట్లకు, ఇతర  వ్యక్తులకు వ¯Œ టైమ్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణకు బ్యాంకింగ్‌కు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. 7 జూ¯Œ  2019లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ పునర్‌వ్యవస్థీకరణ జరపాల్సి ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామ¯Œ   కూడా ఈ మేరకు బహిరంగంగానే సూచనలు చేశారు. అకౌంట్లను ‘స్టాండర్డ్‌’గా వర్గీకరించిన లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకూ రుణ పునర్‌వ్యవస్థీకరణ వర్తిస్తుందని పేర్కొంది. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరంగా ఆయా సంస్థలకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా చూడాలని సూచించింది. రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి రంగాల వారీగా అవసరాల పరిశీలన, ప్రణాళికలకు బ్రిక్స్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్, బ్యాంకింగ్‌ నిపుణులు కేవీ కామత్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు మరో ముఖ్యాంశం.  

► ఇన్నోవేష¯Œ  హబ్‌ ఏర్పాటు: అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్‌ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, బ్యాంకింగ్‌ సేవల పటిష్టత లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేష¯Œ  హబ్‌) ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఎప్పటికప్పు డు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్‌ ప్రధాన బాధ్యతల్లో ఒకటి.  
     
► స్టార్టప్స్‌కు ప్రాధాన్యత: ఇక స్టార్టప్స్‌ విషయానికి వస్తే, వీటికి ప్రాధాన్యతా రంగం హోదాను కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఈ తరహా యూనిట్లు తగిన రుణ సౌలభ్యతను సకాలంలో అందుకోగలుగుతాయి.  
     
► పునరుత్పాదకతకు ‘ఇంధనం’: ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్‌ఎల్‌)  పునరుత్పాదకత ఇంధన      రంగాలకు రుణ పరిమితులను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. సోలార్‌ పవర్, కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి.  
     
► చిన్న రైతులు, బలహీన వర్గాలకూ ఊరట ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్‌ఎల్‌) పరిధిలో చిన్న, సన్నకారు రైతులకు, అలాగే బలహీన వర్గాలకు కూడా రుణ పరిమితులను పెంచాలని ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.   
     
► అకౌంట్ల విషయంలో భద్రతా ప్రమాణాలు
: కస్టమర్లకు కరెంట్‌ అకౌంట్లు, ఓవర్‌డ్రాఫ్ట్‌ అకౌంట్ల ప్రారంభంలో భద్రతా ప్రమాణాలు మరింత పెంపు. బహుళ          బ్యాంకుల నుంచి ఆయా కస్టమర్లకు క్రెడిట్‌ సౌలభ్యం పొందేందుకు అవకాశాల కల్పన వంటి ప్రతిపాదనలు పాలసీ నిర్ణయాల్లో ఉన్నాయి.

కరోనాతో కష్టాలే..
కరోనా వైరస్‌ విస్తరిస్తుండడం, దీనిపై నెలకొన్న అస్పష్టత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) దేశ ఆర్థిక వ్యవస్థను క్షీణబాటలోకి తీసుకువెళుతుందని భావిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థలో రికవరీ జాడలు కనిపిస్తున్నా... కోవిడ్‌–19 ప్రభావం దీనిని అనిశ్చితి వాతావరణంలోకి నెడుతోంది. వృద్ధి అవుట్‌లుక్‌ చూస్తే, ఖరీఫ్‌ సాగు పురోగతి బాగుంది. అందువల్ల స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం కొంత పురోగతి కనబరుస్తుందని భావిస్తున్నాం.

ఇక తయారీ సంస్థల విషయానికి వస్తే, ఫార్మా మినహా అన్ని తయారీ సబ్‌–సెక్టార్లూ ప్రస్తుతానికి ప్రతికూలతలోనే ఉన్నాయి.   2021–22 మొదటి త్రైమాసికం నాటికి పరిస్థితిలో కొంత పురోగతి లభించవచ్చు. నిర్మాణ రంగం మెరుగుపడాల్సి ఉంది. సేవల రంగం విషయానికి వస్తే, మే, జూ¯Œ లలో కొంత రికవరీ ఉన్నా... గత ఏడాది స్థాయికన్నా ఎంతో దిగువనే ఆయా సూచీలు కదలాడుతున్నాయి. ప్యాసింజర్‌ వాహన విక్రయాలు  క్షీణతలోనే కొనసాగుతున్నాయి. దేశీయ ఎయిర్‌ ప్యాసింజర్‌ ట్రాఫిక్, రవాణా క్షీణతలోనే ఉన్నాయి.

ఆర్‌బీఐ సర్వే ప్రకారం, వినియోగదారువైపు నుంచి చూస్తే, జూలైలో ఇంకా వినియోగ విశ్వాసం ప్రతికూలతలోనే ఉంది. అంతర్జాతీయ డిమాండ్‌ కూడా అంతంతమాత్రంగానే కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందగమన పరిస్థితులు, వాణిజ్య క్షీణత వంటి అంశాలు నెలకొని ఉన్నాయి. పరపతి విధాన కమిటీ అంచనా ప్రకారం, ప్రపంచ ఆర్థిక క్రియాశీలత ఇంకా బలహీనంగానే ఉంది. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్‌ ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాలు పటిష్టంగా ఉన్నాయి. తగిన ద్రవ్యపరమైన చర్యలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ చర్యలు కొనసాగుతాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం లక్ష్యాలను మీరకుండా తగిన చర్యలు ఉంటాయి.      
  – శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

వివేకవంతమైన నిర్ణయం
ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బ ణం, డిమాండ్‌పై అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్‌బీఐ వివేకవంతమైన నిర్ణయం తీసుకుంది. రుణ పునర్‌వ్యవస్థీకరణపరమైన ఊరట చర్యలను తగు రక్షణాత్మక విధానాలతో .. భారీ కార్పొరేట్లు, ఎస్‌ఎంఈలు, వ్యక్తిగత రుణగ్రహీతలకు కూడా వర్తింపచేయడం స్వాగతించతగ్గది.
– రజనీష్‌ కుమార్, చైర్మన్, ఎస్‌బీఐ

లిక్విడిటీ బాగున్న నేపథ్యం...
ఇప్పటికే రెపో రేటును గణనీయంగా తగ్గించేయడం వల్ల లిక్విడిటీ పెరిగిపోయిన నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా సమీక్షలో పాలసీ రేటును యథాతథంగా ఉంచడాన్ని అర్థం చేసుకోవచ్చు.
– ఉదయ్‌ కొటక్, ప్రెసిడెంట్, సీఐఐ
 
రుణ పునర్‌వ్యవస్థీకరణ హర్షణీయం
ఎంఎస్‌ఎంఈ రుణాల పునర్‌వ్యవస్థీకరణ, కేవీ కామత్‌ సారథ్యంలో కమిటీ ఏర్పాటు తదితర అంశాలు స్వాగతిస్తున్నాం. వీటి అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
– సంగీతా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్కీ
 
కుటుంబాలకు ఊరట
రుణాల పునర్‌వ్యవస్థీకరణను ప్రకటించడంతో పాటు ఈ క్రమంలో బ్యాంకర్లకు కూడా తోడ్పాటునిచ్చేటటు వంటి చర్యలతో ఆర్‌బీఐ పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించింది. బంగారం రుణాలపై పరిమితి పెంచడం వల్ల ఆదాయాలు నష్టపోయి తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు గణనీయంగా ఊరట లభించగలదు.
– దీపక్‌ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం
 
రేటు ప్రయోజనం బదలాయించాలి...

గడిచిన నాలుగు నెలలుగా రెపో రేటును ఆర్‌బీఐ 115 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించిన ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలి.
– డీకే అగర్వాల్, ప్రెసిడెంట్, పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ.

మరిన్ని వార్తలు