-

శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా

27 Nov, 2023 14:10 IST|Sakshi

చైనాలో మళ్లీ కొత్త రకం కరోనావైరస్‌ విస్తరిస్తోందన్న  ఆందోళనల  మధ్య  చైనా  స్పందించింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు  పలు వ్యాధికారక కారకాల కలయికు కారణమని  చైనా జాతీయ ఆరోగ్య కమిషన్  తెలిపింది.  ప్రధాన కారణాల్లో ఇన్‌ఫ్లుఎంజా ఒకటని ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. చైనాలో నమోదవుతోన్న న్యూమోనియా కేసుల్లో ఎలాంటి అసాధారణమైన లేదా కొత్త వ్యాధికారకాలను గుర్తించ లేదని,  కోవిడ్ -19 మహమ్మారి సమయం నాటి తీవ్రత లేదని కూడా స్పష్టం చేసింది. తద్వారా  కొత్త కరోనా  వస్తోందన్న ఆందోళనలకు చెక్‌ పెట్టింది. 

ఇన్‌ఫ్లుఎంజా, రైనోవైరస్, అడెనోవైరస్‌లు, మైకోప్లాస్మా న్యుమోనియా వంటి అనేక రకాల వ్యాధికారక కారకాల వల్ల కేసులు పెరుగుతున్నాయని నివేదించింది. అలాగే శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల  తీవ్రత అసాధారణం కాదని కూడా  తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.  అలాగే ప్రస్తుతం ఎలాంటి ప్రయాణ ఆంక్షలు అవసరం లేవని కూడా వెల్లడించింది. 

బీజింగ్, లియానింగ్ ,ఇతర ప్రదేశాలలో పిల్లల ఆసుపత్రులలో గుర్తించబడని న్యుమోనియా గురించి నివేదిక తర్వాత పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ  (WHO) చైనా నుండి మరింత సమాచారం కోరిన తర్వాత ఈ వివరాలు వచ్చాయి.  ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని చైనాను కోరింది. అలాగే ఇది వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈమేరకు చైనా అధికారులు స్పందించారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అండ్‌ బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు WHO తెలిపింది. 

చైనాలో చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌  కేసులు కలవర పెట్టాయి.  కరోనా బాగా  ప్రబలిన నాటి రోజులను తలపించేలా చైనాలో ఆసుపత్రుల వద్ద చిన్నారులతో తల్లిదండ్రులు గంటల తరబడి వేచి  ఉన్న దృశ్యాలు కనిపించాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇది వ్యాప్తి చెందకుండా పాఠశాలల్ని తాత్కాలికంగా మూసివేశాయి.  

మరోవైపు వాకింగ్ న్యుమోనియా" కేసులు పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్యులు హెచ్చరించారు. కిండర్ గార్టెన్, ప్రాథమిక పాఠశాల పిల్లలలో మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదించాయి. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండే పెద్ద పిల్లలు, పెద్దలలో తేలికపాటి జలుబు మాత్రమే కనిపిస్తోంది. అయితే ,కొన్ని వారాల పాటు కొనసాగుతున్న లక్షణాలతో చిన్న పిల్లల్లో న్యుమోనియా డెవలప్‌ అయ్యే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. 

మైకోప్లాస్మా న్యుమోనియా
మైకోప్లాస్మా న్యుమోనియా అనేది ఒక బాక్టీరియా, ఇది సాధారణంగా తేలికపాటి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది, సాధారణ జలుబు మాదిరిగానే లక్షణాలు ఉంటాయి. ఇది చాలా అరుదుగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు దగ్గు వారాల పాటు కొనసాగుతుంది.  ఫలితంగా చిన్న పిల్లలకు న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని వార్తలు