కీలక వడ్డీ రేటు యథాతథమే..!

5 Dec, 2023 04:41 IST|Sakshi

రేపటి నుంచి ఆర్‌బీఐ పాలసీ సమీక్ష

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం డిసెంబర్‌ 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. పాలసీ వివరాలను 8వ తేదీన గవర్నర్‌ వెల్లడిస్తారు. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఎకానమీ వృద్ధే లక్ష్యంగా ప్రస్తుత యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం)నే కొనసాగిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. యథాతథ రేటు కొనసాగిస్తే ఈ తరహా నిర్ణయం ఇది వరుసగా ఐదవసారి అవుతుంది. 

ద్రవ్యోల్బణం అదుపులోనికి వచి్చనట్లు కనబడుతున్నప్పటికీ, దీని కట్టడికి కఠిన రేటు విధానాన్నే అవలంభించాలని ఆర్‌బీఐ కమిటీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌  ఆయిల్‌ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్‌ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో గత నాలుగు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది. 

>
మరిన్ని వార్తలు