పసిడి.. పరుగో పరుగు!

5 Dec, 2023 01:04 IST|Sakshi

అంతర్జాతీయంగా, దేశీయంగా ఆల్‌టైమ్‌ గరిష్టానికి...

ఢిల్లీలో 10 గ్రాములు రూ. 64,300కు అప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధరల రికార్డు పరుగు ప్రభావం భారత్‌ బులియన్‌ మార్కెట్‌లో కనబడింది. దేశ రాజధానిలో పసిడి 10 గ్రాముల ధర సోమవారం అంతక్రితం  ముగింపుతో పోలి్చతే రూ.450 పెరిగి రూ.64,300 రికార్డు స్థాయికి చేరినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇక ముంబైలో ధర సోమవారం క్రితం (శుక్రవారం ముగింపు)తో పోలి్చతే 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.553 పెరిగి రూ.63,281కి ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.551 ఎగసి రూ.63,028ని చూసింది. ఇక వెండి విషయానికి వస్తే, రెండు నగరాల్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి కేజీ ధర రూ.80,200 పలికితే, ముంబైలో ఈ విలువ రూ.76,430గా ఉంది.  

విజయవాడ మార్కెట్లో తీరిది...
గడిచిన రెండు రోజుల్లో విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.64,200కు చేరింది. డిసెంబర్‌1న రూ.62,950 గా ఉన్న బంగారం ధర ఒకేరోజు రూ.810 పెరిగి రూ.63,760కు చేరగా,  తాజాగా సోమవారం మరో రూ.440 పెరిగి రూ.64,200కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారట్ల ఆభరణాల పది గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.57,700 నుంచి రూ.58,850కు పెరిగింది.  

అంతర్జాతీయ ప్రభావం...
అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఫిబ్రవరికి సంబంధించి క్రియాశీలంగా ట్రేడ్‌ అవుతున్న  పసిడి ఔన్స్‌ (31.1 గ్రాములు) ధర తాజాగా రికార్డు స్థాయిలో 2,151 డాలర్లను తాకింది. అయితే లాభాల స్వీకరణ నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి 2.3 శాతం క్షీణించి 2,040 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆసియన్‌ ట్రేడింగ్‌లో కూడా ఇంట్రాడేలో ధర ఆల్‌టైమ్‌ కొత్త రికార్డు స్థాయి 2,135 డాలర్లను చూసింది.

అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్‌ బలహీనత, పశి్చమాసియా సంక్షోభ పరిస్థితులు పసిడి పరుగుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) ఇటీవలి సర్వే విడుదలచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా 24 శాతం సెంట్రల్‌ బ్యాంక్‌లు రాబోయే 12 నెలల్లో తమ బంగారం నిల్వలను పెంచుకోవాలని భావిస్తున్నాయని వెల్లడించింది. రిజర్వ్‌ అసెట్‌గా డాలర్‌ కంటే బంగారమే సరైనదన్న అభిప్రాయం దీనికి కారణమని పేర్కొంది. ఈ అంశం కూడా తాజా బంగారం ధర జోరుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు