రియల్‌మీ ఫోన్లలో వ్యక్తిగత డేటా సేకరణ? స్పందించిన కేంద్రమంత్రి

17 Jun, 2023 21:57 IST|Sakshi

చైనాకు చెందిన మొబైల్‌ కంపెనీ రియల్‌మీ ఫోన్‌లలోని కాల్ లాగ్‌లు, లొకేషన్ సమాచారం, ఎస్సెమ్మెస్‌ వంటి వినియోగదారుల వ్యక్తిగత డేటాను సేకరిస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు.

రియల్‌మీ ఫోన్లలోని 'మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్' వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని క్యాప్చర్ చేస్తుందని, ఈ సర్వీస్‌ డిఫాల్ట్‌గా యాక్టివేట్ చేశారని పేర్కొంటూ  ఓ యూజర్‌ చేసిన ట్వీట్‌కు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. దీనిని తనిఖీ చేస్తామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా ఆయన ట్యాగ్ చేశారు.

‘రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్‌ డేటా (కాల్ లాగ్‌లు, ఎస్సెమ్మెస్‌, లొకేషన్ సమాచారం) క్యాప్చర్ చేసే ఫీచర్ (మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్) ఉంది. ఇది డిఫాల్ట్‌గా 'ఆన్'లో ఉంది. సెట్టింగ్‌లు -> అదనపు సెట్టింగ్‌లు -> సిస్టమ్ సేవలు -> మెరుగుపరచబడిన ఇంటెలిజెంట్ సర్వీసెస్‌కి వెళ్లినప్పుడు డిఫాల్ట్ ఫీచర్‌గా 'ఆన్' ఉండటం చూడవచ్చు. భారతీయ వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరిస్తున్నారు. ఇది డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉన్నందున ఇది బలవంతపు సమ్మతి. ఈ డేటా చైనాకు పంపుతున్నారా?’ అంటూ రిషి బాగ్రీ అనే   యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఈ సర్వీస్ ఫీచర్ సెట్టింగ్‌ల కింద లోతుగా ఉండటంతో చాలా మంది వినియోగదారులకు దాని గురించి కూడా తెలియదు. కానీ ఈ ట్వీట్‌ను ఫాలో అయిన మరికొందరు యూజర్లు వన్‌ప్లస్ ఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒప్పో, వివో, రియల్‌మీ కంపెనీలకు మాతృ సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌. వన్‌ప్లస్‌ బ్రాండ్‌ కూడా ఒప్పో అనుబంధ సంస్థే. 

రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 14.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవలే తప్పుకున్నారు. ఉన్నట్టుండి తన పదవి రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు