రీజెన్సీ సెరామిక్స్‌ రీఎంట్రీ

22 Sep, 2023 07:27 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సెరామిక్‌ టైల్స్‌ మార్కెట్లోకి రీజెన్సీ సెరామిక్స్‌ రీఎంట్రీ ఇచ్చింది. చెన్నై విపణిలో గ్లేజ్డ్‌ విట్రిఫైడ్‌ టైల్స్‌ను గురువారం ప్రవేశపెట్టింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంలో రీజెన్సీ సెరామిక్స్‌కు తయారీ కేంద్రం ఉంది. ఈ ప్లాంటు పునరుద్ధరణకు సంస్థ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. 

2023 చివరినాటికి ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. అలాగే పలు కంపెనీలతో కాంట్రాక్ట్‌ తయారీ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రిటైల్‌లో విస్తరించాలన్నది కంపెనీ ఆలోచన. దీర్ఘకాలిక చరిత్ర కలిగిన తమ బ్రాండ్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో మంచి పేరుందని రీజెన్సీ హోల్‌–టైమ్‌ డైరెక్టర్, సీఎఫ్‌వో సత్యేంద్ర ప్రసాద్‌ తెలిపారు. 

వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్ల ఆదాయం ఆర్జిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన నగరాల్లో షోరూంలను ఏర్పాటు చేస్తామన్నారు. రీజెన్సీ సెరామిక్స్‌ను 1983లో డాక్టర్‌ జి.ఎన్‌.నాయుడు స్థాపించారు. కార్మిక సంఘాలు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం చివరకు రక్తసిక్తం కావడంతో 2012లో ప్లాంటు మూతపడింది. 

మరిన్ని వార్తలు