ఇక ఆర్‌ఐఎల్‌ సోలార్‌ పవర్‌

11 Oct, 2021 04:35 IST|Sakshi

రిలయన్స్‌ న్యూ చేతికి 2 కంపెనీలు

నార్వే కంపెనీలో 100 శాతం వాటా

డీల్‌ విలువ రూ. 5,783 కోట్లు

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌లో 40% వాటా

ఒప్పందం విలువ రూ. 2,845 కోట్లు

జీరో కార్బన్‌పై దృష్టి పెట్టిన డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వేగం పెంచింది. ఇప్పటికే రిలయన్స్‌ న్యూ ఎనర్జీ పేరిట పునరుత్పాదక ఇంధన కంపెనీని నెలకొలి్పన సంస్థ ఒకే రోజు రెండు కంపెనీలపై గురిపెట్టింది. తాజాగా నార్వేజియన్‌ దిగ్గజం ఆర్‌ఈసీ సోలార్‌ను సొంతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ రిలయన్స్‌ న్యూ ద్వారా 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ సంస్థ స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌లోనూ 40 శాతం వాటాను చేజిక్కించుకుంది. తద్వారా 2035కల్లా జీరో కార్బన్‌ పోర్ట్‌ఫోలియో నిర్మాణంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వివరాలు చూద్దాం..

న్యూఢిల్లీ: బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌) తొలిసారి ఒక విదేశీ కంపెనీని కొనుగోలు చేసింది. చైనా నేషనల్‌ బ్లూస్టార్‌(గ్రూప్‌) కో నుంచి ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది. నార్వేకు చెందిన ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఈసీ గ్రూప్‌)లో 100 శాతం వాటాను 77.1 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,783 కోట్లు) ఎంటర్‌ప్రైజ్‌ విలువకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ న్యూ ఎనర్జీ పేర్కొంది. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)కు పూర్తి అనుబంధ సంస్థగా రిలయన్స్‌ న్యూ ఎనర్జీ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో 2035కల్లా నికరంగా  జీరో కార్బన్‌తో శుద్ధ ఇంధన పోర్ట్‌ఫోలియో కంపెనీగా ఆవిర్భవించేందుకు ఆర్‌ఐఎల్‌ తొలి అడుగు వేసింది. ఆర్‌ఐఎల్‌ వార్షిక సమావేశంలో శుద్ధ ఇంధన తయారీ సామర్థ్యాలపై రూ. 60,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ముకేశ్‌ పేర్కొన్నారు.  

కంపెనీ తీరిలా..
నార్వే, సింగపూర్‌ కేంద్రాలుగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్‌ ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించిన ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఈసీ గ్రూప్‌)నకు సోలార్‌ ఎనర్జీలో పట్టుంది. కొత్తతరహా సాంకేతిక ఆవిష్కరణలు, అత్యంత మన్నికైన దీర్ఘకాలిక సోలార్‌ సెల్స్, ప్యానల్స్‌ను రూపొందిస్తోంది. 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన కంపెనీ నార్వేలో సోలార్‌ గ్రేడ్‌ పాలీసిలికాన్‌ తయారీకి రెండు, సింగపూర్‌లో పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ తయారీకి ఒక ప్లాంటు చొప్పున నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా 1,300 మందికిపైగా ఉద్యోగులున్నారు.

విస్తరణకు మద్దతు
ఆర్‌ఈసీ విస్తరణ ప్రణాళికలకు పూర్తి మద్దతివ్వనున్నట్లు రిలయన్స్‌ న్యూ ఎనర్జీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్‌ఈసీ.. సింగపూర్‌లో 2–3 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్‌ తయారీతోపాటు.. బ్రాండ్‌న్యూ 2 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్‌ తయారీ యూనిట్‌ను ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది.      ధీరూభాయ్‌ అంబానీ గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ పేరిట జామ్‌నగర్‌లో ఏర్పాటైన  కాంప్లెక్స్‌లో  ఆర్‌ఈసీ సాంకేతికతలను ఆర్‌ఐఎల్‌ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

ఆర్‌ఐఎల్‌కు షాపూర్‌జీ కంపెనీలో వాటా
శుద్ధ ఇంధన ఆస్తులపై దృష్టిపెట్టిన ఆర్‌ఐఎల్‌ తాజాగా స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌లో 40 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,845 కోట్లు వెచి్చంచనుంది. తద్వారా కంపెనీ బోర్డులో ఇద్దరు సభ్యులను నియమించనుంది. ఈపీసీ కార్యకలాపాల స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ను ఖుర్షీద్‌ యజ్డీ డరువాలా కుటుంబంతో కలసి షాపూర్‌జీ పల్లోంజీ భాగస్వామ్య ప్రాతిపదికన(జేవీ) ఏర్పాటు చేసింది. డీల్‌లో భాగంగా తొలుత షేరుకి రూ. 375 ధరలో 2.93 కోట్ల స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన రిలయన్స్‌ న్యూ ఎనర్జీ పొందనుంది.

ఈక్విటీ జారీ తదుపరి పెరగనున్న వాటా మూలధనంలో ఇది 15.46 శాతానికి సమానంకాగా.. తదుపరి మరో 1.84 కోట్ల షేర్లను(9.7 శాతం వాటాకు సమానం) షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ నుంచి అదే ధరలో సొంతం చేసుకోనుంది. ఆపై సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌ నుంచి 25.9 శాతం వాటా(4.91 కోట్ల షేర్లు) కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనుంది. వెరసి కంపెనీలో 40 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. గ్రూప్‌  రూ. 20,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను కొద్ది రోజులుగా షాపూర్‌జీ పల్లోంజీ అమలు చేస్తోంది.

వినూత్న ఇన్వెస్ట్‌మెంట్‌...
కొత్త, ఆధునిక సాంకేతికతలపై ఇన్వెస్ట్‌చేసే మా వ్యూహాలకు అనుగుణంగానే ఆర్‌ఈసీ గ్రూప్‌ను కొనుగోలు చేశాం. నిర్వహణా సామర్థ్యాలు సైతం ఈ దశాబ్దాంతానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్దేశించుకున్న 100 గిగావాట్ల శుద్ధ ఇంధన సాధనకు ఉపయోగపడనున్నాయి.   
– ముకేశ్‌ అంబానీ, ఆర్‌ఐఎల్‌ అధినేత 

మరిన్ని వార్తలు