డయాగ్నస్టిక్‌ కంపెనీలకు ఇబ్బందే

21 Oct, 2022 03:40 IST|Sakshi

తగ్గుముఖం పట్టిన కరోనా పరీక్షలు

పెరిగిన నిర్వహణ వ్యయాలు

ఆదాయం 7 శాతం వరకు క్షీణించొచ్చు

రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ నివేదిక

ముంబై: వ్యాధి నిర్ధారణ సేవల్లోని కంపెనీల (డయాగ్నస్టిక్స్‌) ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం తగ్గొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. కరోనా పరీక్షలు గణనీయంగా తగ్గిపోవడం ఆదాయాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున ఉండడంతో కంపెనీలు ఆదాయంలో 30 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది.

వైరస్‌ ప్రభావం క్షీణించడం, స్వయంగా పరీక్షించుకునే కిట్లకు ప్రాధాన్యం ఇస్తుండడం డయాగ్నస్టిక్స్‌ కంపెనీల ఆదాయాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సంరలో ప్రభావితం చేస్తుందన్నది క్రిసిల్‌ విశ్లేషణగా ఉంది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో కంపెనీల లాభాల మార్జిన్లు దశాబ్ద గరిష్టమైన 28 శాతానికి చేరుకోగా, అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 24–25 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్‌ తెలిపింది.

ఆదాయం తగ్గడానికితోడు అధిక నిర్వహణ వ్యయాలు, ప్రకటనలు, మార్కెటింగ్‌పై అధిక వ్యయాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపిస్తాయని వివరించింది. అయినప్పటికీ మెరుగైన నగదు ప్రవాహాలు, పటిష్ట మూలధన వ్యయ విధానాలు (ఎక్విప్‌మెంట్‌ తదితర), రుణ భారం తక్కువగా ఉండడం వంటివి ఈ రంగంలోని కంపెనీల బ్యాలన్స్‌ షీట్లను ఆరోగ్యంగానే ఉంచుతాయని క్రిసిల్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ రంగంలోని 11 సంస్థల బ్యాలన్స్‌ షీట్లను క్రిసిల్‌ విశ్లేషించింది.

పెరిగిన పోటీ..  
గత ఆర్థిక సంవత్సరంలో కరోనా టెస్ట్‌ల ద్వారా ఆదాయం మొత్తం ఆదాయంలో 20 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైనట్టు క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేతి తెలిపారు. కాకపోతే ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల రూపంలో ఆదాయం 12–14 శాతం మేర పెరగడంతో ఈ ప్రభావాన్ని చాలా వరకు అవి అధిగమిస్తాయని చెప్పారు.

ఆన్‌లైన్‌ ఫార్మసీ సంస్థలు ల్యాబ్‌ టెస్ట్‌లను కూడా ఆఫర్‌ చేస్తుండడంతో ఈ రంగంలో పోటీ పెరిగినట్టు క్రిసిల్‌ వెల్లడించింది. కాకపోతే వైద్యులు సూచించే పరీక్షలకు ఆన్‌లైన్‌ సంస్థల నుంచి పోటీ ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ‘‘ఆన్‌లైన్‌ సంస్థలు సొంతంగా సదుపాయాలపై పెట్టుబడులు పెట్టుకుండా, స్థానిక వ్యాధి నిర్ధారణ కేంద్రాలతో టైఅప్‌ పెట్టుకుని కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.

దీంతో ఇప్పటికే మార్కెట్లో నిలదొక్కుకున్న సంప్రదాయ డయాగ్నస్టిక్‌ సంస్థలు డిజిటల్‌ సదుపాయాలు, రోగి ఇంటికి వెళ్లి నమూనాల సేకరణకు పెట్టుబడులు పెంచాల్సిన పరిస్థితులను కల్పిస్తోంది’’అని క్రిసిల్‌ నివేదిక వివరించింది. భవిష్యత్తులో మరోసారి కరోనా వైరస్‌ మరింత తీవ్రరూపం దాల్చడం, ఆన్‌లైన్‌ సంస్థల నుంచి పెరిగే పోటీ, మార్కెట్‌ వాటా పెంచుకోవడాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు