రష్యా ఎఫెక్ట్‌: స్టీల్‌ ఉత్పత్తికి దెబ్బ

26 Feb, 2022 15:27 IST|Sakshi

కమోడిటీ, ముడిసరుకుల ధరలు భారం 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలకు దిగడంతో కోకింగ్‌ కోల్‌ తదితర కమోడిటీ, ముడిసరుకుల ధరలు క్రమంగా పెరగనున్నట్లు దేశీ స్టీల్‌ అసోసియేషన్‌(ఐఎస్‌ఏ) పేర్కొంది. దీంతో స్టీల్‌ ఉత్పత్తిలో ముడివ్యయాలు భారం కానున్నట్లు అభిప్రాయపడింది. మరోపక్క రష్యా, ఉక్రెయిన్‌ నికరంగా స్టీల్‌ ఎగుమతిదారులుకాగా.. ఉమ్మడిగా 40 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు తెలియజేసింది. వెరసి రష్యా, ఉక్రెయిన్‌ వివాదం అంతర్జాతీయంగా స్టీల్‌ కొరతకు దారితీయవచ్చని పేర్కొంది. 

స్టీల్‌ తయారీలో మెటలర్జికల్‌ కోల్‌ లేదా కోకింగ్‌ కోల్‌ను ప్రధాన ముడిసరుకుగా వినియోగించే సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులతో ఇప్పటికే ముడిచమురు, గ్యాస్‌ ధరలు మండుతున్నట్లు ఐఎస్‌ఏ తెలియజేసింది. ఇది ఇంధన వ్యయాల పెరుగుదలకు కారణంకానున్నట్లు వివరించింది. అంతేకాకుండా కమోడిటీల ధరలు సైతం క్రమంగా పెరుగుతున్నట్లు తెలియజేసింది.  భారత్‌ నుంచి రష్యాకు 20 కోట్ల డాలర్ల(రూ. 1,500 కోట్లు) విలువైన ఎగుమతులు జరుగుతున్నట్లు దేశీ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌(ఐఎస్‌ఎస్‌డీఏ) ప్రెసిడెంట్‌ కేకే పహుజా తెలియజేశారు. 
 

మరిన్ని వార్తలు