వందల కోట్లే..ఎస్‌బీఐ కార్డ్స్‌కు పెరిగిన లాభం!

1 May, 2022 18:01 IST|Sakshi

ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ మార్చి త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం మూడు రెట్లు వృద్ధితో రూ.581 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.175 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,468 కోట్ల నుంచి రూ.3,016 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం మార్చి త్రైమాసికానికి రూ.1,266 కోట్లుగా ఉంది. 

ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,082 కోట్లుగా ఉండడం గమనార్హం. ఫీజులు, కమీషన్ల రూపంలో వచ్చిన ఆదాయం రూ.1,114 కోట్ల నుంచి రూ.1,426 కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ నికర లాభం 64 శాతం వృద్ధి చెంది రూ.1,616 కోట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.984 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 17 శాతం మేర పెరిగి రూ.11,301 కోట్లుగా ఉంది.

 మొండి బకాయిల విషయంలోనూ ఎస్‌బీఐ కార్డ్స్‌ పనితీరు మెరుగుపడింది. స్థూల ఎన్‌పీఏలు 2.22 శాతం, నికర ఎన్‌పీఏలు 0.78 శాతానికి తగ్గాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరికి ఇవి 4.99 శా తం, 1.15 శాతం చొప్పున ఉండడం గమనార్హం. ఒక్కో షేరుకు రూ.2.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.

మరిన్ని వార్తలు