ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

20 Apr, 2023 04:42 IST|Sakshi

సూచీలకు మూడోరోజూ నష్టాలు 

159 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 

నిఫ్టీ నష్టం 41 పాయింట్లు

ముంబై: ఐటీ, ఫైనాన్స్, విద్యుత్‌ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్‌ సూచీలు మూడోరోజూ నష్టాలను చవిచూశాయి. ఇప్పటివరకు వెల్లడైన కార్పొరేట్‌ క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. అలాగే అంతర్జాతీయ బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఉదయం సెన్సెక్స్‌ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,746 వద్ద, నిఫ్టీ ఏడు పాయింట్లు నష్టపోయి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 292 పాయింట్ల పరిధిలో  సెన్సెక్స్‌ 59,453 వద్ద కనిష్టాన్ని, 59,745 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 159 పాయింట్లు నష్టపోయి 59,568 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,580 – 17,666 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి 41 పాయింట్లు పతనమై 17,619 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు చెందిన మధ్య తరహా షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ స్వల్పంగా 0.12 శాతం పెరిగింది. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, ఆయా కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధాన వైఖరిపై ఎదురుచూపుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి.   

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి(గురువారం)కి ముందు హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో రెండున్నర శాతం నష్టపోయి రూ.1,038 వద్ద స్థిరపడింది.  
► రియల్టీ సంస్థ ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.450 వద్ద ముగిసింది. ఆర్థిక సంవత్సరం(2022–23)లో వార్షిక ప్రాతిపదికన రూ. 12,930 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడంతో ఈ షేరుకు డిమాండ్‌ పెరిగింది.

మ్యాన్‌కైండ్‌ @ రూ. 1,026–1,080
ఈ నెల 25–27 మధ్య ఐపీవో
రూ. 4,326 కోట్ల సమీకరణకు రెడీ

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ మ్యాన్‌కైండ్‌ ఫార్మా పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 1,026–1,080 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేస్తోంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 4,326 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.

మరిన్ని వార్తలు