రియల్టీ భవిష్యత్తు ఏంటో?

24 Jul, 2021 04:11 IST|Sakshi

నిరాశపర్చిన ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం

నైట్‌ఫ్రాంక్‌–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్నదని నైట్‌ఫ్రాంక్‌–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్‌పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్‌ రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌ క్యూ2–2021 తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 57గా ఉన్న సెంటిమెంట్‌ స్కోర్‌ క్యూ2 నాటికి 35కి పడిపోయిందని పేర్కొంది. అయితే గతేడాది క్యూ2లో ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి చేరిన 22 స్కోర్‌తో పోలిస్తే ప్రస్తుత క్షీణత తీవ్రత తక్కువేనని తెలిపింది. ఫ్యూచర్‌ సెంటిమెంట్‌ స్కోర్‌ను పరిశీలిస్తే.. ఈ ఏడాది క్యూ1లో 57గా ఉండగా.. క్యూ2 నాటికి స్వల్పంగా తగ్గి 56 స్కోర్‌కు చేరిందని.. అయినా ఇది ఆశావాద జోన్‌లోనే కొనసాగుతుందని పేర్కొంది.

రియల్టీ మార్కెట్‌లో సెంటిమెంట్‌ స్కోర్‌ 50ని దాటితే ఆశావాదం జోన్‌గా, 50గా ఉంటే తటస్థం, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద జోన్‌గా పరిగణిస్తుంటారు. ఈ సర్వేను డెవలపర్లు, బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థల సరఫరా మీద ఆధారపడి జరుగుతుంటుంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగవంతం, నిరంతర ఆర్ధిక కార్యకలాపాల మీద ఆధారపడి భవిష్యత్తు రియల్టీ సెంటిమెంట్‌ స్కోర్‌ ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశీర్‌ బైజాల్‌ తెలిపారు. కరోనాతో రియల్టీ మార్కెట్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నివాస, కార్యాలయ విభాగాలకు అంతర్లీన డిమాండ్‌ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు