నేడు లాభాలతో మార్కెట్లు షురూ?!

19 Oct, 2020 08:29 IST|Sakshi

ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 66 పాయింట్లు అప్‌

నిఫ్టీకి 11,812-11,862 వద్ద రెసిస్టెన్స్‌!

వారాంతాన అటూఇటుగా యూఎస్‌ మార్కెట్లు

లాభాలతో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు  

నేడు (19న) దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 66 పాయింట్లు ఎగసి 11,835 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,769 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో రిటైల్‌ అమ్మకాలు అంచనాలను మించినప్పటికీ వారాంతాన యూఎస్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. అయితే ఫ్యూచర్స్‌ 0.6 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇక గురువారంనాటి భారీ నష్టాల నుంచి బయటపడిన యూరోపియన్‌ మార్కెట్లు వారాంతాన 1.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం 0.5-1 శాతం మధ్య లాభాలతో కదులుతున్నాయి. 

డబుల్‌ సెంచరీతో..
శుక్రవారం హెచ్చుతగ్గుల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 255 పాయింట్లు జంప్‌చేసి 39,983 వద్ద నిలవగా.. నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,762 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 40,126 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 39,699 వరకూ వెనకడుగు వేసింది. ఇక నిఫ్టీ 11,780- 11,668 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,690 పాయింట్ల వద్ద, తదుపరి 11,618 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,812పాయింట్ల వద్ద, ఆపై 11,862 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,239 పాయింట్ల వద్ద, తదుపరి 22,945 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,737 పాయింట్ల వద్ద, తదుపరి 23,940 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 480 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 430 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వెరసి గత వారం ఎఫ్‌పీఐలు నికరంగా 1,186 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 5,217 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి.

మరిన్ని వార్తలు