విలాస ఇళ్లకు భారీ డిమాండ్‌

30 Apr, 2022 20:02 IST|Sakshi

ముంబైలో రెండున్నర రెట్లు అధిక అమ్మకాలు

సోథెబి ఇంటర్నేషనల్‌ నివేదిక

న్యూఢిల్లీ: విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ ఏర్పడింది. రూ.10 కోట్లకు పైగా విలువైన ఇళ్ల విక్రయాలు ముంబై మార్కెట్లో 2021లో రెండున్న రెట్లు పెరిగాయి. రూ. 20,255 కోట్లు విలువైన యూనిట్లు అమ్ముడుపోయాయి. గృహ రుణాలపై కనిష్ట వడ్డీ రేట్లు ఉండడం పెద్ద ఫ్లాట్లకు డిమాండ్‌ను పెంచింది. సోథెబి ఇంటర్నేషనల్‌ రియల్టీ, సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ సంయుక్తంగా ఒక నివేదికను శుక్రవారం విడుదల చేశాయి. 2020లో ముంబైలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు రూ.9,492 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ప్రైమరీ (కొత్తవి), సెకండరీ (రెండోసారి విక్రయానికి వచ్చినవి) కలిసే ఉన్నాయి. సంఖ్యా పరంగా చూస్తే 2021లో ముంబైలో 1,214 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. 2020లో అమ్మకాలు 548 యూనిట్లుగా ఉన్నాయి. ముంబైలోని వర్లి, లోయర్‌ పారెల్, బంద్రా, టార్డో, ప్రభాదేవి, అంధేరి ప్రాంతాలు లగ్జరీ ఇళ్లకు కేంద్రాలుగా ఉన్నాయి. మొత్తం విలాస ఇళ్ల విక్రయాల్లో ఒక్క వర్లి ప్రాంతం నుంచి అమ్ముడుపోయేవే 20 శాతంగా ఉంటున్నాయి. 

కొత్త ఇళ్లే ఎక్కువ  
ప్రైమరీ మార్కెట్‌ విలాస ఇళ్ల అమ్మకాలు 2021లో 848 యూనిట్లుగా, వీటి విలువ రూ.13,549 కోట్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో అమ్మకాలు 349 యూనిట్లుగాను, విలువ రూ.6,275 కోట్లుగా ఉంది. సెకండరీ మార్కెట్లో 366 విలాస ఇళ్లు గతేడాది అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.6,706 కోట్లు. ఇది అంతకుముందు సంవత్సరంలో 199 యూనిట్లుగాను, విలువ రూ.3,217 కోట్లుగాను ఉంది.  

చదవండి: రియల్‌ ఎస్టేట్‌ డీల్స్‌.. ఏప్రిల్‌లో ఇదే రికార్డు..

మరిన్ని వార్తలు