స్పైస్‌జెట్‌ రుణ పునర్వ్యవస్థీకరణ

1 Mar, 2023 08:11 IST|Sakshi

ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ రుణ పునర్వ్యవస్థీకరణకు తెరతీసింది. రుణాలను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా కార్లయిల్‌ ఏవియేషన్‌ పార్టనర్స్‌కు కంపెనీలో 7.5 శాతం ఈక్విటీ వాటాను కేటాయించనుంది. కార్గో బిజినెస్‌(స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌)లోనూ కార్లయిల్‌ ఏవియేషన్‌ వాటాను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌)కు సెక్యూరిటీల జారీ ద్వారా మరో రూ. 2,500 కోట్లు సమకూర్చుకోనుంది. 

విమాన లీజింగ్‌ కంపెనీ కార్లయిల్‌ ఏవియేషన్‌కు చెల్లించవలసిన 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 830 కోట్లు)కుపైగా రుణాలను ఈక్విటీతోపాటు తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే డిబెంచర్లు(సీసీడీలు)గా మార్పిడి చేయనుంది.

ఇందుకు స్పైస్‌జెట్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. షేరుకి రూ. 48 లేదా సెబీ నిర్ధారిత ధరలో 7.5 శాతం వాటాను కార్లయిల్‌(2.95 కోట్ల డాలర్లు)కు స్పైస్‌జెట్‌ కేటాయించనుంది. కార్గో బిజినెస్‌కు చెందిన సీసీడీలను(6.55 కోట్ల డాలర్లు) కార్లయిల్‌కు బదిలీ చేయనుంది. వెరసి 10 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకోనుంది.  

మరిన్ని వార్తలు