స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్‌, ఇండిగోకు జాక్‌పాట్‌

28 Jul, 2022 10:45 IST|Sakshi

సాక్షి,ముంబై: విమానయాన సంస్థ స్పైస్ జెట్‌కు  మరో భారీ షాక్‌  తగిలింది. ఇటీవల సంస్థ విమానాల్లో వరుస  సాంకేతిక లోపాల ఘటనలు ఆందోళన రేపిన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌ రెగ్యులేటరీ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది.  సాంకేతిక సమస్యలు, సెఫ్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎనిమిది వారాలపాటు కేవలం 50 శాతం విమానాలను  మాత్రమే నడిపించాలని  స్పైస్‌జెట్‌ను ఆదేశించింది

ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించడంతో లాభాల మార్కెట్‌లో స్పైస్‌జెట్‌ షేర్‌  7 శాతం కుప్పకూలింది. ఆ తరువాత మరింత  అమ్మకాలు వెల్లువెత్తడంతో 9.66 శాతం తగ్గి రూ. 34.60 వద్ద 52 వారాలా కనిష్టాన్ని తాకింది. మరోవైపు ప్రత్యర్థి విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది.   3 శాతానికి పైగా లాభాలతో ఉంది.

అయితే డీజీసీఏ ఆదేశాలపై స్పందించిన స్పైస్‌జెట్‌ తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. విమానాలను కేన్సిల్‌ చేయలేదని వెల్లడించింది. రానున్న రోజుల్లో, వారాల్లో అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని తెలిపింది. ఇటీవలి సంఘటనలపై చర్యలు తీసుకుంటున్నామన్న సంస్థ  డీజీసీఏ ఆదేశాల మేరకు పని చేస్తామని  పేర్కొంది.

కాగా జూన్ 19, జూలై 5 మధ్య ఎనిమిది స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో  డీజీసీఏ జూలై 6న విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు