స్టాక్‌ మార్కెట్‌: ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

26 Oct, 2022 09:00 IST|Sakshi

ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ

బలిప్రతిపద సందర్భంగా మార్కెట్లకు సెలవు

ముంబై: ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్‌ సూచీల ఏడురోజుల వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఆసియా మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. అధిక వెయిటేజీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఒకటిన్నర శాతం పతనమూ సూచీల నష్టాలకు కారణమైంది. సెన్సెక్స్‌ 288 పాయింట్ల నష్టంతో 59,544 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 75 పాయింట్లు పతనమై 17,656 వద్ద నిలిచింది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఫార్మా, మెటల్, ఐటీ, ఆటో రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ అర శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.35% చొప్పున నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.247 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.872 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా, ఇండోనేషియా, చైనా దేశాల మార్కెట్లు నష్టపోయాయి. యూరప్‌ సూచీలు అరశాతం లాభపడ్డాయి. అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 

60వేల స్థాయి నుంచి వెనక్కి  
సెన్సెక్స్‌ ఉదయం 171 పాయింట్ల లాభంతో 60,003 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 17,808 వద్ద మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 60,081 గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 59,489 పాయింట్ల వద్ద కనిష్టానికి దిగివచ్చింది. నిఫ్టీ 17,637–17,812 పాయింట్ల మధ్య కదలాడింది.   

మార్కెట్లకు సెలవు  
బలిప్రతిపద సందర్భంగా (నేడు)బుధవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. అయితే కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు్ల ఉదయం సెషన్‌లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్‌ జరుగుతుంది.     

‘మూరత్‌ ట్రేడింగ్‌’లో లాభాలు
దీపావళి(హిందూ సంవత్‌ 2079 ఏడాది)సందర్భంగా సోమవారం జరిగిన ‘మూరత్‌ ట్రేడింగ్‌’లో దేశీ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.15 నిమిషాల మధ్య జరిగిన ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఫలితంగా సెన్సెక్స్‌ 525 పాయింట్ల లాభంతో 59,831 వద్ద ముగిసింది. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 17,731 వద్ద స్థిరపడింది.

చదవండి: షాపింగ్‌ బంద్‌, యూపీఐ లావాదేవీలు ఢమాల్‌.. ఏమయ్యా విరాట్‌ కోహ్లీ ఇదంతా నీ వల్లే!

మరిన్ని వార్తలు