భారీ షాక్‌.. ఇన్ఫోసిస్‌కు ఒక్కరోజులోనే 58 వేల కోట్ల నష్టం!

18 Apr, 2023 07:24 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్లో గడచిన రెండేళ్లలో మునుపెన్నడూ సాగని తొమ్మిది రోజుల సుదీర్ఘ ర్యాలీకి సోమవారం బ్రేక్‌ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు దాదాపు ఒకశాతం నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఇన్ఫోసిస్‌ క్యూ4 క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే తక్కువగా నమోదవడంతో సెంటిమెంట్‌ బలహీనపడినట్లు నిపుణులు తెలిపారు.

ఉదయం సెన్సెక్స్‌ 45 పాయింట్ల నష్టంతో 60,385 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభంతో 17,863 వద్ద మిశ్రమంగా మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే బలహీనంగా కదలాడిన సూచీలు చివరి దాకా అదే వైఖరిని ప్రదర్శించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 989 పాయింట్లు క్షీణించి 59,442 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు పతనమై 17,574 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరి గంటలో కనిష్ట స్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర తగ్గాయి. ఆఖరికి సెన్సెక్స్‌ 520 పాయింట్లు నష్టపోయి 59,911 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్లు పతనమై 17,707 వద్ద నిలిచింది.

ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఇంధన, మెటల్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌ సూచీలు అరశాతం చొప్పున లాభపడ్డాయి. పదిరోజుల వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు తొలిసారి రూ.533 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.269 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 82.01 వద్ద నిలిచింది.    

సూచీలకు నష్టాలు ఎందుకంటే  
మొత్తం 9 ట్రేడింగ్‌ సెషన్లలో సూచీలు ఐదుశాతం ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. సూచీల్లో అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్‌(9%), హెచ్‌డీఎఫ్‌సీ(2%) షేర్లు పతనమవడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఐటీ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ దిగ్గజ కంపెనీలు అంచనాల కంటే తక్కువగా త్రైమాసిక ఫలితాలను వెల్లడించడంతో ఈ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రానున్న రోజుల్లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపునకు అనువుగా అమెరికాలో మెరుగైన ఉద్యోగాల గణాంకాలు నమోదయ్యాయి. రేట్ల పెంపు అంచనాలతో ఇన్వెస్టర్లు ఈక్విటీలను విక్రయించి సురక్షితమైన బాండ్లలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఆర్థిక మాంద్య భయాలు, వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ఆసియా మార్కెట్లు 1.50–1% పతనమయ్యాయి. యూరప్‌ సూచీలు పావు శాతం క్షీణించాయి.

ఇన్ఫోసిస్‌కి క్వార్టర్‌ ఫలితాల షాక్‌  
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం నాలుగో క్వార్టర్‌ ఫలితాలు అంచనాల కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలు మార్కెట్‌ అంచనాల కంటే తక్కువగా 4–7% ఉంటుందని పేర్కొంది. దీంతో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఈ షేరుకు డౌన్‌గ్రేడ్‌ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్‌ ధరను తగ్గించాయి. ఫలితంగా బీఎస్‌ఈలో ఈ షేరు 12% క్షీణించి రూ.1,219 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివర్లో తేరుకొని 9.5% నష్టపోయి రూ.1,258 వద్ద నిలిచింది.

షేరు భారీ పతనంతో ఒక్కరోజులోనే కంపెనీ రూ.58,000 కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయింది. ఈ ప్రభావం ఇదే రంగానికి చెందిన ఇతర ఐటీ కంపెనీల షేర్లపై పడింది. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టెక్‌ మహీంద్రా, పర్సిస్టెంట్, హెచ్‌సీఎల్, హెచ్‌సీఎల్‌ టెక్, విప్రో, ఎంఫసిస్‌ షేర్లు 7–2% చొప్పున నష్టపోయాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఏకంగా ఐదుశాతం నష్టపోయింది.      

మార్కెట్లో మరిన్ని సంగతులు  

∙నష్టాల మార్కెట్లోనూ ఐటీసీ షేరు జీవితకాల గరిష్టాన్ని తాకింది. 0.5% లాభంతో రూ.393 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 2% బలపడి రూ.402 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 1% లాభపడి తొలిసారి రూ.400 స్థాయి వద్ద ముగిసింది.  

∙చివరి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలతో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. అత్యధికంగా పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌ షేరు 18 శాతం ర్యాలీ చేసింది. ఇండియన్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్, ఐఓబీ, మహారాష్ట్ర బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఇండియా, షేర్లు 8–4% చొప్పున పెరిగాయి.

మరిన్ని వార్తలు