బుల్‌ను పడేసిన బేర్‌..నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

11 Oct, 2022 09:40 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతుంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి క్షీణించడం, ఉక్రెయిన్‌–రష్యా మధ్య పెరిగిన ఉద్రిక్తతలు,  యూఎస్‌ ఫెడ్‌ రేట్లను పెంచొచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 

దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు మంగళవారం ఉదయం 9.25గంటల సమయానికి సెన్సెక్స్‌ 190 పాయింట్ల నష్టంతో 57800 వద్ద ట్రేడ్‌ అవుతుండగా.. నిఫ్టీ సైతం 60 పాయింట్లు నష్ట పోయి 17180 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

సోమవారం (సెప్టెంబర్‌ 10) నుంచి దేశీ ఐటీ సేవల కంపెనీలు ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటిస్తున్నాయి. సోమవారం టీసీఎస్‌ క్యూ2 ఫలితాల్ని విడుదల చేయగా...విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్‌ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో నేడు ఈక్విటీ మార్కెట్‌లో విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా వంటి టెక్‌ కంపెనీల షేర్లు లాభాల వైపు పరుగులు తీస్తున్నాయి. 

వీటితోపాటు అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, ఆల్ట్రా టెక్‌ సిమెంట్‌, లార్సెన్‌, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

అపోలో హాస్పిటల్‌, ఎథేర్‌ మోటార్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, కోల్‌ ఇండియా, రెడ్డీస్‌ ల్యాబ్‌, సిప్లా, మారుతి సుజికీ షేర్లు  నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.  
  

మరిన్ని వార్తలు